RJ Balaji Reaction on Animal Movie: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ విడుదలయ్యి చాలారోజులే అయ్యింది. దీని తర్వాత మరెన్నో సినిమాలు కూడా థియేటర్లలో విడుదలయ్యి హిట్లు అందుకున్నా కూడా ‘యానిమల్’ గురించి ఇంకా చాలామంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ రివ్యూలు వచ్చాయో.. అంతకంటే ఎక్కువ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. ఇందులో వైలెన్స్‌ను ఎంకరేజ్ చేశారని, ఆడవారిని కించపరిచారని, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తుందని.. ఇలా చాలా అంశాల గురించి సెలబ్రిటీలు సైతం విమర్శించారు. అలా విమర్శించిన సినీ సెలబ్రిటీల లిస్ట్‌లో ఒక తమిళ నటుడు కూడా యాడ్ అయ్యాడు.


సినిమాను సినిమాలాగా చూడాలి..
ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారాడు ఆర్జే బాలాజీ. కొన్నాళ్ల క్రితం హీరోగా కూడా పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ.. ‘యానిమల్’ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ‘‘నేను థియేటర్లలో యానిమల్‌ను చూడలేదు. చాలామంది సినిమాను కేవలం సినిమాలాగా చూడమని, దానిని ఒక క్రాఫ్ట్‌లాగా చూడమని అంటుంటారు. కానీ నాకు మాత్రం ప్రేక్షకులను థియేటర్లలో బంధించి.. ఒక అబ్బాయి అమ్మాయిని కొట్టడం చూపిస్తున్నారని అనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయడం నాకు నచ్చలేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు బాలాజీ.


యూత్ అంతా అదే కరెక్ట్ అనుకుంటారు..
‘‘అలాంటి సీన్స్‌కు ఇది నార్మల్ రియాక్షన్ అని నాకు అనిపించడం లేదు. అలాంటి సీన్స్ చూసి నా సినిమాల్లో కూడా అలాంటివి పెట్టాలని ప్రభావితం చేయడం కరెక్ట్ కాదు. సినిమాలోని ఒక సీన్‌లో యాక్టర్‌ను షూస్ నాకమని చెప్తారని విన్నాను. ఈ సినిమా చూసే యూత్ అంతా ఒక అమ్మాయితో అలా ప్రవర్తించడం కరెక్ట్ అనుకుంటారు’’ అంటూ ‘యానిమల్’పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఆర్జే బాలాజీ. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడు బాలాజీ కూడా ఆ లిస్ట్‌లో జాయిన్ అయ్యాడు. డిసెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’కు ఇప్పటికీ ఈ నెగిటివ్ రియాక్షన్స్ తప్పడం లేదని మూవీని ఇష్టపడినవారు అనుకుంటున్నారు.


ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు..
సినిమాకు వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్, విమర్శలను పక్కన పెడితే.. ‘యానిమల్’కు ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా.. స్క్రీన్‌పై ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాడని, ఇలాంటి మూవీ తెరకెక్కించడం ఈజీ కాదని కొందరు దర్శకులు సైతం తనను ప్రశంసించారు. అదే విధంగా ఇలాంటి ఒక అభ్యంతరకమైన సినిమాను సందీప్ ఎలా తెరకెక్కించాడని విమర్శించిన వారు కూడా ఉన్నారు. అలాంటి విమర్శలు అన్నింటికి సందీప్.. ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఉన్నాడు. థియేటర్లలో సైతం మళ్లీ మళ్లీ ‘యానిమల్’ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ప్రస్తుతం దీనిని ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.


Also Read: అయోధ్యకు చేరుకున్న రీల్ లైఫ్ సీతారామ లక్ష్మణులు - ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు