Ramayan Cast at Ayodhya: అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రీల్ లైఫ్ సీతారామ లక్ష్మణులు వచ్చారు. రామానంద సాగర్ తెరకెక్కించిన ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ’లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీతగా నటించిన దీపికా చిఖ్లియా, లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రీ.. అయోధ్యకు తరలివచ్చారు. దీంతో పాటు ఈ ముగ్గురు కలిసి ‘హమారే రామ్ ఆయేంగే’ అని ఒక స్పెషల్ ఆల్బమ్‌లో నటిస్తున్నారు. ఒకప్పుడు ‘రామాయణం’తో సీతారామ లక్ష్మణులను కళ్లకు కట్టినట్టు చూపించిన నటులు.. మళ్లీ ఇంతకాలం తర్వాత అయోధ్యలో కనిపించడంతో వారితో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.
ఇదే మనకు గర్వకారణం..
రీల్ లైఫ్ రాముడు అలియాస్ అరుణ్ గోవిల్.. అయోధ్య గురించి తన మాటల్లో చెప్పారు. ‘‘అయోధ్య అనేది మన రాష్ట్ర మందిరంగా మారుతుంది. గత కొన్నేళ్లలో ప్రపంచంలోని కల్చర్ అంతరించిపోతోంది. ఈ రామ మందిరం ద్వారా మళ్లీ మన కల్చర్‌ను బలపరచాలి అని అందరికీ సందేశం అందుతుంది. ఇది ప్రపంచానికి మనం అందిస్తున్న వారసత్వం. ఈ ఆలయం స్ఫూర్తినిస్తుంది. నమ్మకానికి పునాదిగా నిలుస్తుంది. ఇదే మనకు గర్వకారణానికి మారుతుంది. మన గుర్తింపుగా నిలుస్తుంది. మన నైతిక విలువలను అందరూ అలవరచుకోవాలి’’ అంటూ అయోధ్య గురించి చాలా గొప్పగా మాట్లాడారు అరుణ్ గోవిల్.
మనసుల్లో ముద్రపడిపోయింది..
‘‘రాముడి విగ్రహ ప్రతిష్ట అనేది ఇంత పెద్ద కార్యక్రమంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నా జీవితంలో నేను హాజరవుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇదే. ఇందులో చాలా ఎమోషన్, ఎనర్జీ ఉంది. రాముడు ఎక్కడ కనిపించినా దేశం మొత్తం ఆయన పేరునే తలచుకుంటోంది. రాముడిని నమ్ముకున్న వారిలో ఒక సంతోషం కనిపిస్తుంది. నేను ఈ కార్యక్రమాన్ని కళ్లారా చూస్తాననే ఆలోచన చాలా ఆనందాన్ని ఇస్తోంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు అరుణ్. దీపికా చిఖ్లియా కూడా ఈ విషయంపై స్పందించారు. ‘‘ప్రేక్షకుల్లో మనసుల్లో మా గురించి ముద్ర పడిపోయింది. రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అది మారుతుందని నేను అనుకోవడం లేదు. రామాయణంలోని పాత్రలకు మరింత ప్రేమ చేరుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ వాతావరణం..
‘రామాయణ’ సీరియల్‌లో లక్ష్మణుడిగా పాపులర్ అయిన సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. ‘‘ప్రాణ ప్రతిష్టా మహోత్సవానికి హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా పవిత్రమైన, పాజిటివ్ వాతావరణం నెలకొంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది’’ అని అన్నారు. ఇక సునీల్, దీపికా, అరుణ్ కలిసి నటించిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాటను సోనూ నిగమ్ పాడాడు. గుప్తార్ ఘాట్, హనుమాన్‌ఘడి, లతా చౌక్ లాంటి ప్రాంతాల్లో ఈ ఆల్బమ్ సాంగ్ షూట్ జరిగింది.
Also Read: విజయ్, రష్మిక సహజీవనం? నేషనల్ మీడియాలో జోరందుకున్న రూమర్స్, ఏమని రాస్తున్నాయంటే?