RGV About Chiranjeevi Character in Vyuham Movie: ఏపీలో రాజకీయ హీట్‌ పెరిగిందనే చెప్పాలి. అటు రాజకీయనాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు. సీట్ల ప్రకటనలతో హాట్‌ హాట్‌గా ఉంటే.. మరోవైపు పోటా పోటీ సినిమాలతో ప్రచారానికి దిగుతున్నాయి పార్టీలు. దాంట్లో భాగంగానే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తెరకెక్కించిన సినిమా 'వ్యూహం' ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా బృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆర్జీవి. దాంట్లో భాగంగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్‌ని పెట్టడంపై వివరణ ఇచ్చారు. 


చిరంజీవి క్యారెక్టర్ అందుకే.. 


'వ్యూహం' ట్రైలర్‌ జనాల్లో ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. ఇక ఆ ట్రైలర్‌లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, జగన్‌, భారతి క్యారెక్టర్‌లను చూపించారు. చివరిలో ఒక సీన్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని కూడా చూపించారు. దీనిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. "చిరంజీవి పాలిటిక్స్‌ నుంచి దూరంగా వెళ్లి చాలా రోజులు అయ్యింది కదా? ఆయన్ను ఎందుకు చూపించారు?" అని అడిగిన ప్రశ్నకి రామ్‌గోపాల్‌ వర్మ ఆస్తికర కామెంట్స్‌ చేశారు. "ఈ సినిమా.. 2009 నుంచి జరిగిన సంఘటనల ఆధారంగా తీసింది. ఆయన కచ్చితంగా పీకేకి రిలేట్ అయి ఉంటారు. వాళ్లిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయనేది సినిమాలో చూడాలి. ప్రతి సినిమా ఇమాజినేషనే. అలా వాళ్లిద్దరి మధ్య జరిగినవి చూపించాను" అని చెప్పారు ఆయన. 


నటులను అలా సెలెక్ట్‌ చేస్తాను.. 


తన సినిమాలోని నటీనటులను సెలెక్ట్ చేయాలంటే.. కొంతమందికి వాళ్ల డీటైల్స్ పంపించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను అన్నారు ఆర్జీవి. "నా సినిమాలో చేసే ప్రిన్సిపుల్ క్యారెక్టర్స్‌కి సంబంధించి వాళ్ల ఫొటోలు, డీటైల్స్ కొంతమందికి పంపిస్తాను. వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్‌ తీసుకుంటాను. అజ్మల్‌ నాకు ముందు నుంచే తెలుసు. ఆయన యాక్టర్‌. అలా సెలెక్ట్‌ చేశాను. మానస ఫొటో వేరే వాళ్లు నాకు పంపించారు. ఆమె ఫొటో చూసిన వెంటనే ఓకే చేసేశాను. ఇక కష్టపడిందంటే పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌ కోసమే.. ఆయన స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌ సెట్ అయ్యేవాళ్లు దొరకడం కొంచెం కష్టం అయ్యింది. అందుకే, ఆయన క్యారెక్టర్‌కి సూట్ అయ్యే వ్యక్తిని పెట్టలేకపోయాను. ఇక సీబీఎన్‌ క్యారెక్టర్‌ చేసిన వ్యక్తి నాసిక్‌లో ఒక టీ స్టాల్‌లో పనిచేస్తారు. ఆయన్ను తీసుకొచ్చి చాలా వీడియోలు చూపించి అలా ట్రైన్‌ చేశాం. అంత కష్టపడ్డాం క్యారెక్టర్‌లను వెతకడానికి" అని చెప్పారు రామ్‌గోపాల్‌ వర్మ. 


వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తూ తెరకెక్కించారు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే, ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, రిలీజ్ వాయిదా వేయాలని కోరుతూ లోకేశ్‌ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్‌లో రిలీజ్‌ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. చివరికి ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. రిలీజ్‌ ముందు రోజు సినిమాని వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. దీంతో మార్చి 1న 'వ్యూహం' సినిమా రిలీజ్‌ కానుంది. 


Also Read: మహశ్‌ బాబు బాటలో మమ్ముట్టి, కిచ్చా సుదీప్‌