రానా దగ్గుబాటి తన ఆరోగ్యం గురించి మొదటిసారి స్పందించాడు. ‘బాహుబలి’ సమయంలో చాలామంది తనను కొందరు తన అనారోగ్యం గురించి ప్రశ్నించేవారని, వారికి తాను సమాచారం చెప్పదలుచుకోలేదని అన్నాడు. ఒక వేళ ఎవరైనా తన ఆరోగ్యం గురించి అడగాలంటే.. కిడ్నీ లేదా కన్ను దానం చేసినవారై ఉండాలని తెలిపాడు. గుర్గావ్‌లో జరిగిన Synapse 2024 కార్యక్రమంలో పాల్గొన్న రానా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు.


అప్పటి నుంచి నా దృక్పథమే మారిపోయింది


‘‘నేను అనారోగ్యంతో అమెరికాలోని మాయో అనే అందమైన ఆసుపత్రిలో చేరాను. అప్పుడే నాకు ఏం జరిగిందో తెలిసింది. ఇంకో ఫన్నీ విషయం ఏమిటంటే.. మీరు ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నప్పుడే.. మీరు జీవితాన్ని భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. అప్పటి నుంచి నేను ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది. మనం అనుకుంటున్నట్లుగా మన జీవితం ఉండదని అర్థమైంది’’ అని రానా తెలిపాడు. 


నేను చేస్తున్న పని నాకే నచ్చలేదు


అనారోగ్యంగా ఉన్నప్పుడు తాను రూడ్‌గా మారిపోయానని రానా అన్నాడు. ‘‘బాహుబలి.. సమయంలో అంతా నేను మూవీ కోసమే అలా అయ్యానని అనుకొనేవారు. కొందరు ఎగతాళి చేయడం చూశాను. అనారోగ్యంతో ఉన్నావా అని అడిగేవారు. కానీ, నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగరంలో ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే మీరు కిడ్నీ లేదా కన్ను దానం చేస్తేనే దాని గురించి అడగండి. లేకపోతే వద్దని చెప్పేవాడిని. నేను చేస్తున్న పని నాకే నచ్చలేదు’’ అని రానా భావోద్వేగంతో చెప్పాడు.


ప్రకృతే నయం చేసింది 


అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత రానా ప్రభు సోలమన్‌తో ‘కాదన్’ అనే తమిళ చిత్రంలో నటించాడు. ఆ మూవీ మొత్తాన్ని అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో ‘అరణ్య’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ టైటిల్స్‌తో విడుదల చేశారు. తాను అనారోగ్యం నుంచి కోలుకోడానికి ఆ మూవీ షూటింగ్ ఎంతో ఉపయోగయపడిందని రానా తెలిపాడు. ‘‘లక్కీగా నాకు అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. ఆ మూవీ కోసం నేను దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నాను. నేను ఏనుగులతో గడిపాను. అక్కడ నేను అనారోగ్యంతో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడి నిశ్శబ్దం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రకృతిని మించిన గొప్ప వైద్యం లేదు’’ అని రానా పేర్కొన్నాడు.


ప్రస్తుతం రానా నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ సీజన్-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దర్శకుడు తేజాతో ‘రాక్షసరాజ’ మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని మూవీస్‌కు కూడా రానా సైన్ చేసినట్లు తెలుస్తోంది. వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లీడర్’ మూవీకి త్వరలోనే సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.


Also Read: 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?