Kerala High Court about Movie Reviews: సినిమాలపై రివ్యూలు అనేవి చాలా ప్రభావం చూపిస్తాయి. రివ్యూలు పట్టించుకోకుండా సినిమాలకు వెళ్లాలని చాలామంది ప్రేక్షకులు ప్రయత్నిస్తారు. కానీ ఒక మూవీ విడుదలయ్యిందంటే చాలు.. సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే దాని గురించే రివ్యూలు నిండిపోతాయి. దీంతో కేరళ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. థియేటర్లలో విడుదలయిన 48 గంటల వరకు ఎవరూ సినిమా రివ్యూలు ఇవ్వకూడదని ప్రకటించింది. దీంతో కేరళ మూవీ నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు.


కేరళ హైకోర్టు ప్రకటన..


ఒక సినిమా ఫస్ట్ షోకు వచ్చే టాక్.. మేకర్స్‌కు చాలా కీలకం. కానీ రివ్యూవర్స్ మాత్రం సినిమాలపై వారి అభిప్రాయాలు వారు చెప్తూ ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తారు. అందుకే ఒక మూవీ విడుదలయిన 48 గంటల వరకు ఎలాంటి రివ్యూను ప్రచారం చేయడానికి రివ్యూవర్స్‌కు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించుకుంది కేరళ హైకోర్టు. ఈ విషయాన్ని కేరళ హైకోర్టు సలహాదారులైన శ్యామ్ పద్మన్ స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా నెగిటివ్ రివ్యూలపై వేటు వేయడానికి సైబర్ సెల్స్‌లో ప్రత్యేకమైన పోర్టల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం కచ్చితంగా సినిమాలకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.


డబ్బులు ఇవ్వకపోవడమే కారణం..


కేరళ హైకోర్టు ఈ నిర్ణయం ప్రకటించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. సినిమా రివ్యూలపై కొన్నిరోజుల క్రితం ఒక పిటీషన్ ఫైల్ అయ్యింది. అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రివ్యూలు అనేవి ప్రేక్షకుల అభిప్రాయాలపై ప్రభావం చూపిస్తున్నాయని శ్యామ్ పద్మన్ తెలిపారు. దానివల్లే సినిమా విడుదలయిన 48 గంటల వరకు ఎవరూ రివ్యూలు పోస్ట్ చేయకూడదని, సినిమాలపై విమర్శలు కురిపించకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కొన్నిసార్లు సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ డబ్బులు ఇవ్వకపోయినా.. కావాలనే నెగిటివ్ రివ్యూలను ఇచ్చి ప్రేక్షకులపై ప్రభావం పడేలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదివరకు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. మేకర్స్ వారికి డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


అసభ్యకర వ్యాఖ్యలు..


సినిమాను, మేకర్స్‌ను మెరుగుపరిచే విమర్శలు చేయడంలో తప్పు లేదని, కానీ సినిమాను కించపరిచేలా, ప్రేక్షకులపై ప్రభావం చూపించేలా రివ్యూలు పోస్ట్ చేయడం సరికాదని శ్యామ్ పద్మన్ అన్నారు. అంతే కాకుండా సినిమా బాలేకపోతే క్యాస్ట్ అండ్ క్రూపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తుచేశారు. అందుకే ప్రొఫెషనలిజంను కాపాడడం కోసం ఇలాంటి చట్టపరమైన నిర్ణయాలు తప్పవన్నారు. అలాంటి విమర్శలను దాటి కొన్ని చిత్రాలు సక్సెస్‌ను సాధిస్తున్నాయి. కానీ చాలావరకు చిత్రాలు మాత్రం ఇలాంటి నెగిటివ్ రివ్యూల వల్లే మినిమమ్ కలెక్షన్స్ రాబట్టలేక లాభాల్లో మునిగిపోతున్నాయి. అందుకే కేరళ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై మేకర్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘బిగ్ బాస్’ పల్లవి ప్రశాంత్ - రైతు కుటుంబానికి ఆర్థిక సాయం