Anand Deverakonda Upcoming Movie Titled Duet: సినిమాల్లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సూపర్ సక్సెస్ సాధించిన హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ప్రస్తుతం విజయ్‌కు యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. ఇక ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న తర్వాత తన తమ్ముడు ఆనంద్‌ను కూడా హీరోగా పరిచయం చేశాడు విజయ్. ఆనంద్ దేవరకొండ కూడా ఇప్పుడిప్పుడే యూత్‌ఫుల్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. గతేడాది విడుదలయిన ‘బేబి’ మూవీ ఆనంద్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అందుకే ఎక్కువగా లవ్ స్టోరీలే చేయాలని డిసైడ్ అయ్యాడు ఈ హీరో. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ బ్యూటీతో జోడీకడుతూ ఆనంద్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది.


రిఫ్రెషింగ్ ఫస్ట్ లుక్..


సాయి రాజేశ్ దర్శకత్వంలో గతేడాది విడుదలయిన ‘బేబి’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని దాదాపు రెండు నెలల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. ఇక ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ కెరీర్ మరో మలుపు తిరిగింది. అందుకే ప్రేమకథలే తనకు హిట్‌ను అందిస్తాయనే నమ్మకంతో ‘డ్యూయెట్’ అనే మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు మేకర్స్.


స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై..


‘డ్యూయెట్‌’లో ఆనంద్ దేవరకొండకు జోడీగా ‘హాయ్ నాన్న’ ఫేమ్ రితికా నాయక్ నటిస్తోంది. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ పాత్ర పేరు మదన్ అని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇక ‘డ్యూయెట్’ పోస్టర్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉందంటూ నెటిజన్లు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ మొదలయ్యి.. ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్‌పై ‘డ్యూయెట్’ చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ అనేది ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ తమిళ చిత్రాలను తెరకెక్కించింది. ఇక తెలుగు ఆనంద్ దేవరకొండలాంటి యంగ్ హీరోతో సినిమా చేయడానికి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.






కొత్త పెయిర్..


యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది రితికా నాయక్. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన ‘హాయ్ నాన్న’లో గెస్ట్ రోల్‌తో అందరినీ పలకరించింది. ఇందులో తను కనిపించేది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది రితికా. ప్రస్తుతం తన ఖాతాలో పలు యూత్‌ఫుల్ సినిమాలు ఉండగా.. అందులో ఆనంద్ దేవరకొండతో నటిస్తున్న ‘డ్యూయెట్’ కూడా ఒకటి. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ పెయిర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇదొక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కావడంతో దీనికి జీవి ప్రకాశ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు మేకర్స్.


Also Read: సల్మాన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు - ఆమిర్‌ మాజీ భార్య కిరణ్‌ రావుపై ఆ కామెంట్‌, తప్పుదిద్దుకున్న హీరో