Renu Desai: ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. దీంతో ఎక్కడ చూసినా పవన్ గురించి, ఆయన గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా కొందరు నెటిజన్లు అనవసరంగా తన పర్సనల్ లైఫ్ గురించి చర్చలు చేస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత పవన్, రేణు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయినా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్‌తో రేణును ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. వారిపై తను మరోసారి రియాక్ట్ అయ్యారు.


బాధ కలుగుతోంది..


తాజాగా ఒక ఫ్యాన్.. రేణు దేశాయ్ పోస్ట్‌కు కామెంట్ చేశారు. ‘‘మీరు చాలా దురదృష్టవంతురాలు మేడమ్. మీకు చాలా అందమైన కొడుకు, కూతురు ఉన్నారు’’ అని అన్నారు. దురదృష్టవంతురాలు అనడం రేణు దేశాయ్‌కు నచ్చలేదు. దీంతో ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘నేను ఎలా దురదృష్టవంతురాలినో నాకు కొంచెం చెప్తారా. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది’’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు రేణు. ఇదే కామెంట్‌‌ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేశారు. ‘‘నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎన్నో ఏళ్లుగా కొంతమంది నన్ను దురదృష్టవంతురాలు అని అంటున్నారు. ఇది విని నాకు చాలా బాధ కలుగుతుంది, నా ఓపిక నశించిపోతోంది’’ అని వాపోయారు రేణు దేశాయ్.


అదృష్టంగా భావిస్తాను..


‘‘నా అదృష్టం అనేది ఎందుకు ఒక మగవాడితో ముడిపడి ఉంటుంది? ఇలాంటి జీవితం దొరకడం అదృష్టంగా భావిస్తాను. నా జీవితంలో లేనిదాని గురించి బాధపడడం కంటే ఉన్నదానితో సంతోషంగా ఉన్నాను. విడాకులు తీసుకున్న మగవారు, ఆడవారు.. కేవలం వాళ్ల పెళ్లి వర్కవుట్ అవ్వకపోతే వాళ్లు దురదృష్టవంతులు అని అనుకోవడం మానేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను’’ అంటూ తన అభిప్రాయం బయటపెట్టారు రేణు దేశాయ్.






మైండ్‌సెట్ మారాలి..


‘‘ఇది 2024. పార్ట్‌నర్ చనిపోతే లేదా విడాకులు తీసుకొని విడిపోతే దాన్ని దురదృష్టంగా భావిస్తే మనం సమాజంలో ముందుకు వెళ్తాం. ఒక మనిషిని తమ టాలెంట్‌తో, హార్డ్ వర్క్‌తో గుర్తిస్తే బాగుంటుంది. మన మైండ్‌సెట్‌ను మార్చుకుందాం’’ అంటూ సలహా ఇచ్చారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత చాలాకాలం వరకు రేణు ఏమైపోయారు అనే విషయం చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్.. ఆమెకు నచ్చని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.



Also Read: నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఏపీలో పార్టీల నుంచి నాకు ఆఫర్ వచ్చింది - ఉపేంద్ర