Varun Tej Matka shooting : టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ ని కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక రీసెంట్ గా ఈ జంట హనీమూన్ ట్రిప్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక హనీమూన్ ముగించుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ చివరగా 'గాండీవ దారి అర్జున' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.


ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా సాలిడ్ హెట్ కొట్టి భారీ కం బ్యాక్ ఇవ్వాలని రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలను సెట్స్ పై తీసుకెళ్లాడు. అందులో ఒకటి 'ఆపరేషన్ వాలెంటైన్', మరొకటి 'మట్కా'. ఇప్పటికే 'ఆపరేషన్ వాలెంటైన్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కంటే ముందు 'మట్కా' షూటింగ్లో పాల్గొంటున్నాడు ఈ మెగా హీరో. పలాస 1978 మూవీ ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా మొదలైంది.






వరుణ్ తేజ్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడం కోసం మూవీ టీం ఏర్పాట్లు చేసింది. అందుకోసం హైదరాబాద్ సరిహద్దుల్లో ఓ స్పెషల్ సెట్ వేసినట్లు తెలియజేస్తూ మేకర్స్ ఓ అప్డేట్ అందించారు.' మట్కా షూట్ బిగిన్స్' అంటూ ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో సినిమా డైరెక్టర్ మానిటర్ లో సీన్ చెక్ చేసుకుంటున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.


పీరియాడికల్ బ్యాండ్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల 'హాయ్ నాన్న' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వైరా ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' 2024 ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం.


Also Read : అదిరిపోయే ట్విస్టులు, అడుగడుగునా అడ్డంకులు- ‘వ్యూహం’ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?