Ram Charan's RC 16 Movie Backdrop Story Revealed: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) కాంబోలో 'RC 16' వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కాగా.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో కథ ఉండనున్నట్లు ప్రచారం సాగింది. తొలుత ఈ చిత్రం కోడి రామ్మూర్తి జీవితం కథ ఆధారంగా తీస్తున్నారని ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ తర్వాత అలా కాకుండా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ.. సినిమాకు వర్క్ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రత్నవేలు 'RC 16' సినిమా అప్ డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుపుతూ.. ఓ ఫోటో షేర్ చేశారు. 'నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్' అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. క్రికెట్ స్టేడియంలో ఉన్న లైట్స్ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుండగా క్యాప్షన్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.

Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

గతంలోనూ ఓ పోస్టుతో..

కాగా, రత్నవేలు (Rathnavelu) గతంలోనూ ఈ సినిమా గురించి చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇందులోని ఓ సీక్వెన్స్‌ కోసం నెగిటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. సహజత్వం కోసం అలా చేయనున్నట్లు స్పష్టం చేశారు. అటు దేవర సినిమాకీ కొంతమేర ఆ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. 'పూర్తిస్థాయి నెగిటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే.. నటీనటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు. అదే నెగిటివ్ ఉండే కెమెరాలతో షూటింగ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.' అని వెల్లడించారు.

టైటిల్ అదేనా..

అటు, దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే 'RC 16' కథలో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమయ్యాయని.. 2  పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే రెహమాన్ తెలిపారు.

Also Read: 'వేవ్స్' అడ్వయిజరీ మెంబర్స్ బోర్డులో చిరంజీవికి స్థానం... మోడీ పిలుపు, అరుదైన గౌరవంపై మెగాస్టార్ స్పందన