Chiranjeevi: 'వేవ్స్' అడ్వయిజరీ మెంబర్స్ బోర్డులో చిరంజీవికి స్థానం... మోడీ పిలుపు, అరుదైన గౌరవంపై మెగాస్టార్ స్పందన
WAVES Summit : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న వేవ్స్ సమ్మిట్ 2025కు సంబంధించి సినీ ప్రముఖులతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అందులో భాగమైన చిరు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. భారత్ ను అంతర్జాతీయ వినోద కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బిజినెస్ మాన్స్ శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అందులో వేవ్స్ కోసం వారి సలహాలు, సూచనలను మోదీ స్వీకరించారు. అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తాను ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ, తనను వేవ్స్ అడ్వైజరీ బోర్డులో మెంబర్ గా చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
'వేవ్స్'లో మెంబర్ గా మెగాస్టార్
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ 'వేవ్స్' గురించి చేసిన పోస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ఎక్స్ వేదికగా చిరు చేసిన ఆ పోస్టులో "గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోడీకి.. నాకు ఈ అరుదైన గౌరవం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి పని చేయడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ మోడీ జీ మానసపుత్రిక అయిన వేవ్స్ భారతదేశం సాఫ్ట్ పవర్ ని ప్రపంచంలో నెక్స్ట్ లెవెల్ కు నడిపిస్తుందనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. త్వరలో కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి" అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇందులో భాగమైన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
కాన్ఫరెన్స్ అనంతరం మోడీ ట్వీట్
సినీ, వ్యాపార దిగ్గజాలతో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రధాని మోదీ ఆ వీడియోను షేర్ చేస్తూ, ఎక్స్ వేదికగా ఈ భేటీపై స్పెషల్ పోస్ట్ పెట్టారు. వేవ్స్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా వెల్లడిస్తూ, ఇందులో సభ్యులైన సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దడానికి సపోర్ట్ చేయడంతో పాటు, సమ్మిట్ కోసం తమ విలువైన సలహాలు సూచనలు ఇచ్చారని వెల్లడించారు. వేవ్స్ సమ్మిట్ - 2025 సీజన్ 1ను కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 9 మధ్య నిర్వహించబోతున్నారు. వచ్చే నవంబర్లో గోవాలో ఇది అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో కలిపి ఈ సమ్మిట్ సమాంతరంగా జరగబోతోంది.
వేవ్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సినీ ప్రముఖులు
శుక్రవారం సాయంత్రం మోడీ వేవ్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, హేమమాలిని, దీపికా పదుకొనే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read: డైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?