Raveena Tandon | బాలకృష్ణ నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని ‘‘స్వాతిలో ముత్యమంట..’’ సాంగ్ వినగానే వెంటనే గుర్తుకొచ్చేది రవీనా టాండనే(Raveena Tandon). వాన పాటలో బాలయ్యతో స్టెప్పులేస్తూ రవీనా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేవీ రాలేదు. ‘ఆకాశ వీధిలో’, ‘రధసారథి’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే, అప్పటికే రవీనాకు బాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉంది. దీంతో ఆమె ఉత్తరాది చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. తాజాగా ‘KGF’ చాప్టర్-2 చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రవీనా. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తుచేసుకుంది.
రవీనా 1991లో ‘పత్తర్ కే ఫూల్’ సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత బాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది. అయితే, ఆమె ఏ రోజు నటిని అవుతానని అనుకోలేదట. నటిని కావాలనే ఆశయం కూడా ఆమెకు లేదట. అయితే, పేదరికం వల్ల 10వ తరగతి తర్వాత చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేందట. ఈ సందర్భంగా ఆమె యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ స్టూడియోలో పనులు చేసేదట.
‘‘అప్పట్లో నేను స్టూడియో ఫ్లోర్‌లను శుభ్రం చేయడం నుంచి స్టాల్స్ ఫ్లోర్‌లు, వాంతిని తుడిచివేయడం వరకు అన్ని పనులు చేసేదాన్ని. ప్రహ్లాద్ కక్కర్‌కి సాయం చేస్తుండేదాన్ని. ఆ సమయంలో ఆయన నువ్వు తెర వెనుక ఏం చేస్తున్నావు? నువ్వు స్క్రీన్ ముందు ఉండాలి అనేవారు. అందుకు నేను ‘నేనా? నటినా? సాధ్యమే కాదు’ అనేదాన్ని. కాబట్టి నేను అనుకోకుండా ఈ పరిశ్రమలో ఉన్నానని ఇప్పటికీ అనుకుంటాను. నేను నటిని అవుతానని ఏ రోజూ ఆలోచించలేదు’’ అని తెలిపింది.
Also Read: 'నా పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసింది' - 'కేజీఎఫ్2' సినిమాపై సంజయ్ దత్ కామెంట్స్
అలా మొదలైంది..: రవీనా టాండన్‌ను ఓ యాక్సిడెంటల్ మోడల్ అని చెప్పుకోవాలి. ప్రహ్లాద్ కక్కర్ స్టూడియోలో షూట్‌లకు వచ్చే మోడల్‌లు విఫలమైనప్పుడు.. అతడు వారి స్థానంలో రవీనా టాండన్‌ను మోడలింగ్ చేయాలని కోరేవాడు. దీంతో ఆమె మొదట్లో ఉచితంగానే అతడికి మోడలింగ్ చేస్తూ సాయం చేసేది. ఆ తర్వాత డబ్బు సాంపాదనకు మోడలింగ్ ఉపయోగపడుతుందనే భావనతో అదే కొనసాగించింది. ఆమె ప్రకటన వీడియోలు చూసి.. బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. అలా ఆమె సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. తాజాగా ‘కేజీఎఫ్-చాప్టర్ 2’లో కనిపించి మరోసారి తన ప్రతిభను చాటింది. ఈ చిత్రం తర్వాత ఆమె మరోసారి ‘ఘుడచాడి’ సినిమాతో సంజయ దత్‌తో స్క్రీన్ పంచుకోబోతోంది.
Also Read: తల్లి కాబోతున్న సునీత? ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారా?