Rashmika Mandanna: ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా రష్మిక మందనా కెరీర్‌నే మలుపు తిప్పింది. తాజాగా విడుదలయిన ‘యానిమల్’ అనే మరో పాన్ ఇండియా మూవీ పర్ఫార్మర్‌గా రష్మికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా భారీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది ఈ కన్నడ బ్యూటీ. సినిమాల నుంచి తీరిక దొరికినప్పుడల్లా హాలీడేస్‌కు వెళ్లడం రష్మికకు అలవాటే. కానీ ఈసారి మాత్రం వరుసగా సినిమాల షూటింగ్స్ ఉన్నా కూడా వాటి నుంచి షార్ట్ బ్రేక్ తీసుకొని తను హాలీడేకు బయల్దేరినట్టు తెలుస్తోంది. షూటింగ్‌ ప్యాకప్ అయిపోయిన వెంటనే తను హాలీడే కోసం ఫ్లైట్ ఎక్కినట్టు సమాచారం.


గీతాంజలి పాత్రతో క్రేజ్..


డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’లో గీతాంజలి పాత్రలో కనిపించింది రష్మిక మందనా. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌లాగా తన పాత్ర కాసేపే అన్నట్టుగా కాకుండా తనకంటూ గుర్తింపు వచ్చేలా గీతాంజలి క్యారెక్టర్‌ను రాసుకున్నాడు సందీప్. దర్శకుడు రాసిన పాత్రకు రష్మిక పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని ప్రేక్షకులు కూడా ప్రశంసించారు. దీంతో ఈ సినిమా వల్ల తనకు మరెన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తెలుగు, తమిళ బైలింగువల్ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.


అవార్డుల వేడుక కోసమే..


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సీనియర్ హీరో నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇందులో ధనుష్‌కు జోడీగా రష్మిక కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక షూటింగ్‌కు ప్యాకప్ చెప్పగానే రష్మిక.. జపాన్‌కు పయణమయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ డేట్స్ అసలు ఖాళీ లేకపోగా.. ఈ ట్రిప్ కొన్నిరోజుల్లోనే ముగుస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా టోక్యోలో జరుగుతున్న క్రంచీరోల్ యానిమై అవార్డుల వేడుక కోసం రష్మిక.. జపాన్‌కు వెళ్లినట్టు సమాచారం. దాంతో పాటు సినిమాల నుంచి ఒక చిన్న బ్రేక్‌ను కూడా తను ఎంజాయ్ చేయనుంది.


‘పుష్ప 2’లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్..


ధనుష్‌తో నటిస్తున్న సినిమాతో పాటు రష్మిక చేతిలో ప్రస్తుతం ‘పుష్ప 2’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమా విడుదలయ్యి దాదాపు రెండున్నర ఏళ్లు గడుస్తుండగా.. పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించినా.. దీనికి సంబంధించిన ఎలాంటి షూటింగ్ అప్డేట్ కూడా బయటికి రావడం లేదు. దీంతో అసలు ‘పుష్ప 2’ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అని అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇది మాత్రమే కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే మూవీలో కూడా నటిస్తూ బిజీగా గడిపేస్తోంది రష్మిక మందనా.


Also Read: అతడితో ఆ సీన్లలో సౌకర్యంగా ఫీలయ్యా - మూడ్ కోసం అలా చేసేవాళ్లు - నటి తన్వి నేగి