The Sabarmati Report Teaser Out: గోద్రా రైలు దహనం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రంలో ‘12th ఫెయిల్‌’ ఫేమ్‌ విక్రాంత్‌ మస్సే, రాశీ ఖన్నా, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చందేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు, ఏక్తా కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. అందులో భాగంగానే మూవీ టీజర్ ను విడుదల చేసింది.


గోద్రా రైలు దహనం ఘటనలో అసలు ఏం జరిగింది?


ఇక ఈ టీజర్ లో విక్రాంత్‌ మస్సే జర్నలిస్టుగా కనిపిస్తున్నారు. గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ ను తగులబెట్టడం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. టీవీలో గోద్రా దహన సంఘటనకు సంబంధించిన వార్తను ప్రసారం చేసే యాంకర్ శ్రబన్ కుమార్ గా మస్సే కనిపించడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. టెలిప్రాంప్టర్‌ చూస్తూ వార్తను చదువుతున్నప్పుడు, గోద్రా ఘటనను దురదృష్టకర ప్రమాదంగా చదివేందుకు వెనుకాడుతాడు. ఇది ప్రమాదం కాదని గట్టిగా వాదిస్తాడు. దీంతో టీజర్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాలో 22 ఏండ్ల క్రితం గోద్రా రైలు ప్రమాదానికి గల అసలు వాస్తవాలను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ ను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన నటుడు విక్రాంత్‌ మస్సే కీలక వ్యాఖ్యలు చేశారు. “22 ఏళ్ల క్రితం గోద్రా రైలు దహనం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 59 మంది అమాయకులకు ఈరోజు నివాళులర్పిస్తున్నాను. మే 3న ‘ది సబర్మతి రిపోర్ట్’ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అని రాసుకొచ్చారు. 






సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ దహనంలో 59 మంది మృతి


ఫిబ్రవరి 27, 2002న ఉదయం సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులను గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కొంత మంది దుండగులు కాల్చి చంపారు. సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాలో రాశి ఖన్నా, రిధి డోగ్రా కీలక పాత్రలు పోఫిస్తున్నారు. రంజన్ చందేల్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అమూల్ వి మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం మే 3న థియేటర్లలో విడుదల కానుంది.


ఇక రీసెంట్ గా విక్రాంత్ మన్సే‘12th ఫెయిల్‌’ మూవీలో కనిపించాడు. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మనోజ్ కుమార్ అనే IAS అధికారి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  


Read Also: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల