Ranveer Singh: ఈమధ్య బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి కూడా. ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సైతం సౌత్ డైరెక్టర్ అట్లీతో ‘జవాన్’ అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు యంగ్ హీరో రణవీర్ సింగ్ కూడా అదే ఫాలో అవ్వనున్నాడు. ఒక మలయాళ డైరెక్టర్‌తో రణవీర్ సినిమా చేయనున్నట్టు బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్రలో రణవీర్ కనిపించనున్నాడని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


‘డాన్ 3’ కోసం కసరత్తులు..


ప్రస్తుతం రణవీర్ సింగ్.. ‘డాన్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌లాంటి హీరోలు డాన్స్‌గా కనిపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఈ ‘డాన్’ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ముందు రెండు సినిమాల్లో కూడా షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. అందుకే ‘డాన్ 3’లో రణవీర్ హీరోగా కనిపించనున్నాడు అని అనౌన్స్‌మెంట్ రాగానే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంతే కాకుండా రణవీర్ సింగ్ వద్దు అంటూ విమర్శలు కూడా చేశారు. అయినా ప్రస్తుతం ఫ్యాన్స్‌ను ఎలాగైనా ఖుషీ చేయాలని ‘డాన్ 3’ కోసం వర్క్‌షాప్ కూడా మొదలుపెట్టాడు రణవీర్. ఇంతలోనే తను ఒక సూపర్‌మ్యాన్ చిత్రంలో నటించనున్నాడని టాక్ మొదలయ్యింది.


బాలీవుడ్‌లో తక్కువ..


మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ఒక సినిమాను సైన్ చేశాడట. అంతే కాకుండా గత మూడేళ్ల నుండి పక్కాగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట బాసిల్. ఇక ఈ సినిమాలో రణవీర్.. ‘శక్తిమాన్’ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. బాలీవుడ్‌లో సూపర్ హీరో స్టైల్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అందులో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అదే తరహాలో ‘శక్తిమాన్’ కూడా హిట్ అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సోనీ పిక్చర్స్ ఇండియా, సాజిద్ నదియాడ్వాలా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. కానీ ‘శక్తిమాన్’ సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.


ఇంతకీ బాసిల్ జోసెఫ్ ఎవరో తెలుసా?..


బాసిల్ జోసెఫ్ మరెవ్వరో కాదు. ‘మిన్నాల్ మురళి’ అనే సూపర్ మ్యాన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. మెరుపు తగిలి ఒక మామూలు మనిషి సూపర్ హీరో ఎలా అయ్యాడు అని చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు బాసిల్ జోసెఫ్. దీంతో ‘శక్తిమాన్’ మూవీ కూడా ఆయన న్యాయం చేస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.


రణవీర్.. దర్శకుడు ఫర్హాన్‌తో చేస్తున్న ‘డాన్ 3’ మూవీ 2024 ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి అప్పటివరకు రణవీర్ సింగ్ వర్క్‌షాప్‌లోనే పాల్గొనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి.. ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే ‘శక్తిమాన్’ సెట్స్‌పైకి వెళ్లనుంది.


Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?