మీకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ మూవీ గుర్తుందా? అందులో కృష్ణతో రొమాన్స్ చేసిన మరో భామ మందాకినీని నాటి తరం ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేరు. అయితే, తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఓ వెలుగు వెలిగింది. రాజ్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘రామ్ తేరి గంగా మైలీ’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన మందాకినీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలనాటి అందాల తార తాజాగా  కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఆమెతో పాటు సంగీతా బిజ్లానీ కూడా ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.


సెట్ లో నన్ను చూసి అందరూ షాక్ అయ్యారు!


తన తండ్రి ఆమెను గన్ తో షూట్ చేసి చంపేశారనేది మందాకిని జీవితంలో అత్యంత సంచలన వార్త. ఆ వార్తపై తాజాగా మందాకిని స్పందించారు. “ఒకరోజు నేను యథావిధిగా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ కు వెళ్లాను. సెట్ లోకి వెళ్లగానే అందరూ ఆందోళనగా ఉన్నారు. నన్ను చూసి షాక్ అయ్యారు. అందరూ దగ్గరికి వచ్చి బాగున్నావా? అని అడిగారు. వాళ్లు నా గురించి ఎందుకు ఆందోళనగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. అవన్నీ కేవలం ఊహాగానాలే అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు” అని చెప్పుకొచ్చారు.  


నా భర్తను ఎలా కలిశానంటే?


మందాకిని తన వ్యక్తిగత విషయాలను మీడియా ముందుకు తీసుకురారు. తన పర్సనల్ విషయాల గురించి మీడియాలో వార్తలు కూడా చాలా తక్కువగా వస్తాయి.  ఆమె మాజీ బౌద్ధ సన్యాసి డాక్టర్ కాగ్యుర్ టి రింపోచే ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, తన తనకు భర్త ఎలా పరిచయం అయ్యారు? ఎలా పెళ్లి చేసుకున్నారు? అనే విషయాలను కపిల్ షోలో మందాకిని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటికీ హిందీ రాదని చెప్పారు. “మా అమ్మ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ కావడంతో, మేము తరచుగా అక్కడికి వెళ్లేవాళ్ళం. అప్పుడే ఆయన్ని అక్కడ చూశాను. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి మేము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మేం మొదటిసారి కలిసినప్పుడు  అతడికి హిందీ రాదు. నేను అతడి తల్లితో హిందీలో మాట్లాడితే, ఆమె తనకు వారి భాషలో కమ్యూనికేట్ చేసింది. అలా చాలా రోజుల పాటు మా మధ్య అనువాదకురాలిగా వ్యవహరించింది. మా వైవాహిక ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, అతను క్రమంగా హిందీని నేర్చుకున్నాడు” అని తెలిపారు.    


ఇక మందాకిని 1985లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంతో వెండి తెరపై తొలిసారి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘కహాన్ హై కానూన్’,  ‘ప్యార్ కర్కే దేఖో’ లాంటి చిత్రాలలో నటించింది. ఆమె చివరి బాలీవుడ్ చిత్రం 1996లో అజయ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘జోర్దార్’. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


Read Also: డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా - 'బూ' టీజర్ రిలీజ్!