Ram Gopal Varma: టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. తన ఇంటర్వ్యూలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం తను డైరెక్ట్ చేసిన ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఆర్జీవీ. అదే క్రమంలో తాజాగా అయిదుగురు లేడీ యాంకర్లతో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో అసలు ‘వ్యూహం’ సినిమా ఎందుకు తెరకెక్కించారో బయటపెట్టారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరి గురించి ఒక్క మాటలో చెప్పడంతో పాటు తనను తాను కోతితో పోల్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


నేను కోతిని..


తన గురించి ఒక్క మాటలో చెప్పమంటూ ఏం చెప్తారు అని అడగగా.. ‘‘నేను కోతిని’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ‘‘కోతి అంటే మంచి, చెడు ఏం లేదు. జోకర్ అంతే. నేను కోతి అని ఎందుకు అనుకుంటున్నానంటే ఆ ఒక్క జంతువు మాత్రమే జీవితాన్ని సీరియస్‌గా తీసుకోదు. అది సింహం జుట్టు పీకి, తోక లాగి మళ్లీ వెళ్లి చెట్టెక్కి కూర్చుంటుంది. అది నేను’’ అని తన స్టైల్‌లో సమాధానం చెప్పారు వర్మ. ఒకప్పుడు క్లాసిక్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు రామ్ గోపాల్ వర్మ. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలిటికల్ సెటైర్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. అందులో ‘వ్యూహం’ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించి ‘వ్యూహం’ తెరకెక్కించారని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదని ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ.


ఆయన జిత్తులమారి..


‘‘ఓదార్పు యాత్ర వల్లే మొదటిసారి జగన్ నా దృష్టిలో పడ్డాడు. అక్కడి నుంచి హైకమాండ్‌కు ఎదురుతిరగడం, జైలుకు వెళ్లడం.. అన్నీ చేసి ఫైనల్‌గా అత్యధిక మెజారిటీతో గెలిచాడు. దీనికి స్టడీ ఏం అవసరం లేదు. నేను ఒక సామాన్యుడిగా నాకు తెలిసినదాన్ని బట్టి ఆలోచిస్తాను’’ అంటూ ‘వ్యూహం’ గురించి, జగన్ గురించి చెప్పారు ఆర్జీవీ. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకుల గురించి ఒక్కొక్క పదంలో చెప్పుకొచ్చారు. జగన్‌ను జయించేవాడని అన్నారు. చంద్రబాబు నాయుడు జిత్తులమారి అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సరైన పదం దొరకడం లేదని, స్థిరత్వం లేనివాడని అనొచ్చని చెప్పారు. లోకేశ్‌ను లెక్కనేని తిక్కలోడు అన్నారు. చిరంజీవికి మెగా అని ట్యాగ్ ఇచ్చి, అంతకంటే ఏం లేదన్నారు.


షర్మిల ఏం చేయలేదు..


వైఎస్ షర్మిలపై తన అభిప్రాయం చెప్పమని రామ్ గోపాల్ వర్మను అడగగా.. ‘‘షర్మిల అంటే నథింగ్ అనుకుంటాను. ఎందుకలా అంటున్నానంటే.. జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆయనకు ప్రజల దగ్గరకు యాక్సెస్ దొరకకపోవడం వల్ల షర్మిల మీటింగ్స్ పెట్టారు. వాటికి జనం వచ్చారు. జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆమె చెప్పేది. నేను జగనన్న వదిలిన బాణం అనేది. కానీ తనెవరో చెప్పలేదు. జగన్ దొరకడం లేదు కాబట్టి షర్మిలలో జగన్‌ను చూసుకోవడానికి అంతమంది మీటింగ్స్‌కు వచ్చారు. షర్మిల కోసం రాలేదు. తెలంగాణలో తను సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఎవరూ ఆ మీటింగ్స్‌కు రాకపోవడమే దానికి ప్రూఫ్. జగన్ ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టడంలాంటివి చాలా చేశారు. షర్మిల అసలు ఏం చేయలేదు. ఎప్పుడూ తన వెనుకే ఉంది. అందుకే షర్మిల నథింగ్’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.


Also Read: ‘శతమానం భవతి’ సీక్వెల్.. శర్వా ప్లేస్ లో ఆ క్రేజీ హీరో