తెలుగులో ట్రావెల్ బేస్డ్ సినిమాలు తక్కువ. అందులోనూ రోడ్ జర్నీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అరుదు. లడఖ్ నేపథ్యంలో పూర్తిగా రోడ్ జర్నీ బేస్డ్ మూవీగా 'ఆన్ ది రోడ్' (On The Road Telugu Movie) రూపొందింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చేతుల మీదుగా విడుదలైంది. 


ఐదు భాషల్లో 'ఆన్ ది రోడ్'
రాఘవ్‌ తివారీ, స్వామి మెహ్రా జంటగా 'ఆన్ ది రోడ్' సినిమా రూపొందింది. సూర్య లక్కోజు దర్శకత్వం వహించారు. ఇందులో కర్ణ్‌ శాస్త్రి, రవి సింగ్‌, రాహుల్‌ కుమార్‌, ఎస్‌ఎస్‌ అంగ్‌ చోక్‌ ఇతర తారాగణం. ఎస్.పి.ఎల్ పిక్చర్స్ పతాకంపై రాజేష్ శర్మతో కలిసి దర్శకుడు సూర్య లక్కోజు చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. పూర్తిగా లడఖ్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి సినిమా ఇదేనని వారు పేర్కొన్నారు. 


'ఆన్ ది రోడ్' ట్రైలర్ ఎలా ఉందంటే?
లడఖ్ ప్రాంతంలో ఓ కారు... పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ జంట అక్కడికి వెళుతుంది. కారు ఆగడంతో ఒకరు పెట్రోల్ తీసుకు రావడానికి వెళతారు. కారులో జంట రొమాన్స్ మొదలు పెడతారు. లడఖ్ వాసులు తుపాకీలు తీసుకు వచ్చి వాళ్ళను బెదిరిస్తారు. కారులో ఉన్న రొమాన్సుకు రెడీ అయిన జంట ఎవరు? సైకిల్ వేసుకుని వెళ్లి వచ్చినది ఎవరు? చివరకు ఏమైంది? అనేది స్క్రీన్ మీద చూడాలి. 


Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?



'ఆన్ ది రోడ్' పోస్టర్లు, ట్రైలర్లలో స్టైలిష్ మేకింగ్ కనిపించిందని, ఇటువంటి జానర్ సినిమాలు తక్కువ కనుక ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని, ఈ సినిమా విజయం సాధించాలన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయనతో 'ఆన్ ది రోడ్' దర్శకుడు సూర్య లక్కోజు పలు చిత్రాలకు పని చేయడం విశేషం. ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తున్నారు. 


Also Read : 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ - దసరాకు టీజర్ రిలీజ్, అదీ ఎప్పుడంటే?


దర్శక నిర్మాత సూర్య లక్కోజు మాట్లాడుతూ ''రోడ్ ట్రిప్ అనేది వెస్టర్న్ ఫిల్మ్ జానర్. నాకు చాలా ఇష్టం. అందుకే ఒక సింపుల్ కథను తీసుకుని పరిమిత నిర్మాణ వ్యయంలో తీశాం. లడఖ్ ప్రాంతంలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్. ఓ జంటతో సాధారణ వ్యక్తి కలవడం... వారితో ఆ వ్యక్తి ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే సినిమా కథాంశం'' అని తెలిపారు.


రాఘవ్‌ తివారీ, స్వామి మెహ్రా, కర్ణ్‌ శాస్త్రి, రవి సింగ్‌, రాహుల్‌ కుమార్‌, ఎస్‌ఎస్‌ అంగ్‌ చోక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూర్పు : మందర్‌ మోహన్ సావంత్, కళా దర్శకత్వం : రాహుల్‌కుమార్‌, పోరాటాలు : గోపి, ఛాయాగ్రహణం : గిఫ్టీ మెహ్రా, మాటలు : శ్రీనివాస్‌ కోమనపల్లి, సంగీతం : సుర్భిత మనోచా, నిర్మాతలు: సూర్య లక్కోజు - రాజేశ శర్మ, కథ - దర్శకత్వం : సూర్య లక్కోజు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial