మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'. 2016లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, అప్పటి వరకూ ప్లాపుల్లో ఉన్న చెర్రీని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్టైన 'తని ఒరువన్' అనే చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'ధృవ' ఒరిజినల్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. సోమవారం 'తని ఒరువన్ 2' సినిమాని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


'జ‌యం' ర‌వి హీరోగా, ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'తని ఒరువన్'. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రను పోషించారు. 2015 ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, పెద్ద సక్సెస్ సాధించింది. నిన్నటికి ఈ సినిమా వచ్చి 8 ఏళ్ళు పూర్తైన తరుణంలో, 'తని ఒరువన్ 2' ప్రాజెక్ట్ కు అనౌన్స్ చేసారు దర్శకుడు మోహన్ రాజా. ఈ సందర్భంగా మూవీ కాన్సెప్ట్ టీజర్ ను కూడా రిలీజ్ చేసారు. 


'తని ఒరువన్' సీక్వెల్ లో ASP మిత్రన్ IPS పాత్రను జయం రవి పోషించనున్నారు. అలానే మొదటి భాగంలో ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ మహిమ పాత్రలో నటించిన హీరోయిన్ నయనతార కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కునుంది. వచ్చే ఏడాది 2024 ప్రారంభంలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ లో నటించే మిగిలిన ప్రధాన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా విలన్ ఎవరు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


'తని ఒరువన్ 2' అనౌన్స్ మెంట్ వీడియోలోకి వెళ్తే.. ''సిద్దార్థ్ అభిమన్యుని తన మొదటి శత్రువుగా ఎంచుకున్న తర్వాత మిత్రన్ తన ప్రయాణాన్ని ప్రారభిస్తాడు.. ఫైనల్ గా మిత్రనే తన ఒకే ఒక్క శత్రువు అని సిద్దార్థ్ అభిమన్యు నిర్ణయించుకుంటాడు. మొదటి అధ్యాయం ముగింపుకు వచ్చింది'' అని డైరెక్టర్ మోహన్ రాజా వాయిస్ ఓవర్ తో ఓపెన్ అవుతుంది. “నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెబుతాను”, “నువ్వు ఎవరో చెప్పు, మీ శత్రువు ఎవరో నేనే చెబుతాను” అంటూ వైట్ బోర్డ్‌పై తమిళంలో కొన్ని లైన్స్ రాయడాన్ని మనం చూడొచ్చు. 


''సిద్దార్థ్ ఇచ్చిన బహుమతిని మిత్రన్ తన అంతిమ ఆయుధంగా భావించాడు.. తర్వాతి శత్రువు ఎవరంటే.. వారిని ఎదుర్కోవడానికి మిత్రన్ సిద్ధంగా ఉన్నాడు..'' అని మోహన్ రాజా తన ల్యాప్‌ టాప్‌లో టైప్ చేస్తుండగా, జయం రవి తన చేతిలో SD కార్డ్ ని తిప్పుతూ కారిడార్ గుండా బయటకు వస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి తన శత్రువు ఎవరనేది మిత్రన్ ఎంచుకోలేడు. నిరుత్సాహానికి గురైన మిత్రన్ క్లూ దొరక్క అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే 'ఈ స్టోరీలో శత్రువే మిత్రన్ ని వెతుక్కుంటూ వస్తాడు' అని చెప్పడంతో ఈ టీజర్ ముగిసింది. ఎంతో స్టైలిష్ గా రూపొందించిన ఈ వీడియో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



'తని ఒరువన్' అనేది మంచి చెడుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమా. ఒక నిజాయితీ గల పోలీసు మరియు అత్యంత తెలివైన విలన్ చుట్టూ కథంతా తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో సిద్ధార్థ్ అభిమన్యుడు అనే స్ట్రాంగ్ విలన్ గా అరవింద్ స్వామిని ప్రెజెంట్ చేసారు. క్లైమాక్స్ లో హీరోకి ఒక చిప్ ని గిఫ్ట్ గా ఇచ్చి చనిపోవడంతో కథ ముగుస్తుంది. అయితే అక్కడి నుంచే పర్ఫెక్ట్ సీక్వెల్ గా రెండో చాప్టర్ స్టార్ట్ కానుందని 'తని ఒరువన్ 2' అనౌన్స్ మెంట్ వీడియోని బట్టి తెలుస్తోంది. ఇది మొదటి భాగాన్ని మించి ఉంటుందని టీజర్ హామీ ఇస్తోంది. మరి ఈసారి హీరోని ఢీకొట్టే బలమైన ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తారో చూడాలి. 


'తని ఒరువన్ 2' అనౌన్సమెంట్ సందర్భంగా మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ''తని వరువన్ 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నా 11వ చిత్రం 'తనిఒరువన్ 2' కోసం AGS ప్రొడక్షన్ తో 3వ సారి చేరడం, లేడీ సూపర్ స్టార్ నయనతారతో 4వ సారి చేతులు కలపడం, నా ప్రియమైన జయంరవితో 7వ సారి జట్టు కట్టడం గర్వంగా ఉంది. నిర్మాత కల్పాతి అఘోరం సర్‌కి పెద్ద థ్యాంక్స్. నా తల్లిదండ్రులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. అర్చన కల్పాతి, ఎస్ గణేష్, ఎస్ సురేష్, ఐశ్వర్య కల్పాతి.. మీ అందరి ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలి'' అని పేర్కొన్నారు.






Also Read: HBD King Nagarjuna: 'సెల్యులాయిడ్ సైంటిస్ట్' నాగార్జున - ఈ సినిమాలే నాగ్‌ను ‘కింగ్’ చేశాయ్!