Game Changer: మెగాస్టార్ చిరంజీవి బాటలోనే తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నడుస్తున్నాడా? అంటే అవునని చెప్పక తప్పదు. తండ్రి బాటలో తనయుడు నడిస్తే తప్పేముందని అంతా అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఈ మధ్యకాలంలో ‘చిరు లీక్స్’ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆయనని ఏదైనా ఫంక్షన్‌‌కి ముఖ్య అతిథిగా పిలిస్తే చాలు.. ఆ ఫంక్షన్‌లో తన పర్సనల్ విషయాలను, తను చేస్తున్న సినిమా విషయాలను లీక్ చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆ మధ్య ‘ఆచార్య’ సినిమా టైటిల్ లీక్ చేసి.. దర్శకుడు షాక్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత కూడా చాలా వేదికలపై చాలా విషయాలను లీక్ చేసిన చిరు.. ఇక లాభం లేదనుకుని సోషల్ మీడియా వేదికగా.. ముందే చిరు లీక్స్ అంటూ కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సేమ్ టు సేమ్ చిరులానే ‘రామ్ చరణ్ లీక్స్’ అనుకునేలా తను నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్న క్యాస్టింగ్‌ని లీక్ చేశారు. 


Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!


ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు ఈ గ్లోబల్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ముందుగా నాగ్‌తో ‘గేమ్ చేంజర్’ విశేషాలను షేర్ చేసుకున్న చరణ్.. ఆ తర్వాత టీజర్‌ని ప్లే చేయించారు. ఇక అక్కడ కూర్చుని ఉన్న కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. గంగవ్వ, రోహిణి తన ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటించినట్లుగా చెప్పి.. ‘గేమ్ చేంజర్’ లీక్స్‌కి కారణమయ్యారు. గంగవ్వ అని నాగార్జున అనగానే.. ‘మొన్న గేమ్ చేంజర్‌లో కలిసి చేశాం. గట్టిగా నన్ను తిట్టారు. రోహిణిగారిని కూడా సెట్‌లోనే కలిశాను’ అని రామ్ చరణ్ ఈ స్టేజ్‌పై చెప్పడంతో వాళ్లంతా హ్యాపీగా ఉండటం ఏమోగానీ.. రామ్ చరణ్ ఇలా లీక్ చేశాడేంటి అని అంతా సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ చేస్తున్నారు.






సినిమాలో వాళ్ల పాత్రలకు అంతగా ప్రాముఖ్యత ఉండదు కాబట్టి.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. లేదంటే మాత్రం ఈ పాటికే సోషల్ మీడియాలో రామ్ చరణ్ లీక్స్ అంటూ టామ్ టామ్ చేసేవారు. ఏదిఏమైనా ఈ విషయంలో రామ్ చరణ్, చిరుని ఫాలో అవకూడదని మెగా ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఇక ‘గేమ్ చేంజర్’ విషయానికి వస్తే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కే కాదు, డైరెక్టర్ శంకర్‌కి కూడా ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ముఖ్యంగా దర్శకుడు శంకర్ మనుగడ ఇంకొంత కాలం ఉండాలంటే కచ్చితంగా ‘గేమ్ చేంజర్’ హిట్ కావాలి. రాబోయే సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ముస్తాబు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ నెల 21న అమెరికాలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ‘పుష్ప’ సిరీస్ చిత్రాల దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి