టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో 24 వేలకు పైగా డాన్స్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించినందుకు గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ నేపథ్యంలోనే చిరుకు పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిమానుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి అందుకున్న ఈ అరుదైన గౌరవంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు.
నాలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ - చరణ్
మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆయన పేరును నిలబెట్టేలా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చెర్రీ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకొని ఆ అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న సమయంలో పక్కన రామ్ చరణ్ లేకపోవడం మెగా అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే చరణ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ లోటును తీర్చేశాడు. తన తండ్రి గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించిన సత్కారాన్ని అందుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ "గిన్నిస్ వరల్డ్ రికార్డులో ది మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ సినిమా కేటగిరిలో ఈ అరుదైన రికార్డును సాధించిన మీకు కంగ్రాట్యులేషన్స్ అప్పా... 150 సినిమాల్లో, 537 పాటల్లో... 24 వేలకు పైగా డాన్స్ మూవ్స్ చేసిన మీరు, మీ రిమార్కబుల్ 45 ఏళ్ల జర్నీ అద్భుతం. మీ హార్డ్ వర్క్ నాకు, నాతో పాటు కోట్లాది మందికి ఇన్స్పిరేషన్" అంటూ తన తండ్రిపై అభిమానాన్ని, అలాగే అరుదైన గౌరవాన్ని అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు రామ్ చరణ్.
మీ వల్లే సాధ్యం - చిరు స్పెషల్ థాంక్స్ నోట్
గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ తెలుగు వారిక గర్వకారణం, తెలుగు ప్రజలతో పాటు ఎంతోమందికి స్పూర్తి అంటూ అభిననందల వర్షం కురిపిస్తున్న అందరికీ మెగాస్టార్ స్టేజ్ పైనే కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోమారు స్పెషల్ థాంక్స్ నోట్ ను రిలీజ్ చేశారు చిరు. అందులో "నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది నేనెప్పుడూ ఊహించనిది. ఇన్నేళ్లుగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు, నా నిర్మాతలు, దర్శకుల వల్లనే ఇది సాధ్యమైంది. అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన అందరు సంగీత దర్శకులు, నాకు కొన్ని మరపురాని డ్యాన్స్ మూవ్‌లను అందించిన కొరియోగ్రాఫర్‌లు అందరూ, ఇన్నాళ్లూ నా పనిని మెచ్చుకున్న సినీ ప్రేక్షకులు, మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులందరికీ, కుటుంబ సభ్యులకు, సినీ ప్రముఖులకు, పెద్దలకు, రాజకీయ, మీడియా ప్రముఖులకు, పాత్రికేయులకు, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆప్యాయత, శుభాకాంక్షలు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఇప్పుడు, ఎల్లప్పుడూ నాపై కురిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు ! నిజం ఏమిటంటే నేను మీ అందరికీ కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే" అంటూ సుధీర్ఘ నోట్ ను రిలీజ్ చేస్తూ అందరికీ పేరు పేరునా థాంక్స్ చెప్పారు చిరు.
Also Read: కుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయ్యాక రచ్చ రచ్చ