చిరంజీవి (Megastar Chirajeevi)... ఈ పేరు ఒక్కటి చాలు సగటు సినీ ప్రేక్షకుడు గౌరవంగా ఫీల్ అవ్వడానికి. ఇక మెగా అభిమానులు అయితే పేరు వింటే చాలు పులకించపోతారు. సుమారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో టాలీవుడ్ మార్కెట్ స్థాయిని పెంచిన హీరోగా చిరంజీవి ప్రస్థానం తిరుగులేనిది. సాధారణంగా హీరోలకు ఫాన్స్ ఉంటారు. కానీ హీరోలే ఫ్యాన్స్ గా ఉండే స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టారే. అలాంటి చిరంజీవి నటించిన 100వ సినిమా రిలీజై నేటికి 36 ఏళ్ళు. ఆ సినిమానే ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో రిలీజ్ అయిన 'త్రినేత్రుడు'. సెప్టెంబర్ 22.... అంటే సరిగ్గా ఈ రోజున 36 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యింది 'త్రినేత్రుడు'. ఇది చిరంజీవి సొంత సినిమా. ఆయన తమ్ముడు నాగబాబు ఈ సినిమాకు నిర్మాత. విశేషం ఏమిటంటే... చిరంజీవి మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' కూడా ఇదే తేదీన సెప్టెంబర్ 22న రిలీజ్ కావడం.


భారీ అంచనాలతో రిలీజ్ అయిన త్రినేత్రుడు


'త్రినేత్రుడు' సినిమా విషయానికి వస్తే... చిరంజీవి 100వ సినిమా కావడంతో ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎగబడ్డారు. అయితే, దానిని సొంత బ్యానర్ లో తీయాలని భావించిన చిరంజీవి... అంజనా ప్రొడక్షన్స్ సంస్థలో తమ్ముడు నాగబాబు నిర్మాతగా చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా భాను ప్రియ, విలన్‌గా బాలీవుడ్ నటుడు కుల భూషణ్ ఖర్బంద, ఇంకా కీలక పాత్రల్లో మురళీ మోహన్, చంద్రమోహన్, రంగనాథ్, సత్యనారాయణ, బాబ్ ఆంథోనీ లాంటి వారు నటించారు. సినిమా ఓపెనింగ్ సన్నివేశాల్లో ఒక ప్రత్యేక పాత్రలో నాగబాబు కనిపిస్తారు. ఈ చిత్రానికి ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా... అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న రాజ్ -కోటి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా అధిక భాగం గోవాలో షూటింగ్ అయింది.


సమాజాన్ని పీడిస్తున్న సమస్యను అప్పట్లోనే డీల్ చేసిన సినిమా 


ఈ సినిమా కథాంశం డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు దేశంలో అదొక ప్రధాన సమస్యగా మారింది. డ్రగ్స్ వద్దని స్టార్స్‌ సహా పలువురు ప్రముఖులు అవగాహనా వీడియోలు చేస్తున్నారు. డ్రగ్ మాఫియాను అరికట్టే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం డ్రగ్స్ కు ఎలా బానిసలుగా మారుతున్నారో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు చిరంజీవి.


Also Read: గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి - మరో మెగా రికార్డ్‌, ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ప్రకటన



అయితే అప్పట్లో సామాన్య ప్రేక్షకులకు డ్రగ్స్ దందా గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో 'తినేత్రుడు' హిట్ స్థాయిలోనే ఆగిపోయింది. సినిమా గనుక ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే దాని రేంజ్ వేరే స్థాయిలో ఉండేది అంటారు చిరు ఫ్యాన్స్. ఇక ఆ ఏడాది చిరంజీవి 'యముడికి మొగుడు'తో ఇండస్ట్రీ హిట్... 'ఖైదీ నెంబర్ 786'తో సూపర్ హిట్ అందుకుని తానే బాక్స్ ఆఫీస్ కింగ్ గా మరోసారి నిరూపించుకున్నారు.


Also Readచిరంజీవికి అక్కినేని అవార్డు... అమితాబ్ చేతుల మీదుగా - ANR100 ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన నాగార్జున