'బాహుబలి'లో సేతుపతిగా నటించిన రాకేష్ వర్రే (Rakesh Varre) గుర్తు ఉన్నారా? గుడిలో తన మీద చెయ్యి వేయబోతే అనుష్క ఓ సైనికుడి వేళ్ళు నరికేస్తారు కదా! ఆ తర్వాత ప్రభాస్ చేతిలో శిక్షకు గురి అవుతారు. ఆయనే రాకేష్ వర్రే. 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాలో హీరోగా కూడా నటించారు. ఇప్పుడు హీరోగా మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాయే 'జితేందర్ రెడ్డి'.  


'ఉయ్యాలా జంపాలా'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma). ఆ తర్వాత నాని హీరోగా 'మజ్ను' తీశారు. పదేళ్ళలో విరించి వర్మ దర్శకత్వం వహించిన సినిమాలు రెండు మాత్రమే! ఆ రెండిటికీ అభిమానులు ఉన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ తీశారని పేరు తెచ్చుకున్నారు. అటువంటి విరించి వర్మ ఒక్కసారిగా రూటు మార్చి వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా 'జితేందర్ రెడ్డి' తెరకెక్కిస్తున్నారు. అందులో హీరో ఎవరు? అంటూ కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ హీరో ఎవరో చెప్పేశారు. 


'జితేందర్‌ రెడ్డి'గా రాకేష్ వర్రే!
విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy Movie)లో రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. హిస్టరీ / హిజ్ స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌.... (ప్రజలకు అతని కథ చెప్పాలి / ప్రజలకు చెప్పాల్సిన చరిత్ర అని అర్థం) అనేది ఈ సినిమా ఉప శీర్షిక. 


'జితేందర్ రెడ్డి'గా రాకేష్ వర్రే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో ఆయన గన్ పట్టుకుని నడుస్తున్నారు. డ్రస్ చూస్తే... పోలీస్ అన్నట్లు ఉంది. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రీ లుక్స్ చూస్తే రాజకీయ నాయకుడు అన్నట్లు ఉంది. మరి, ఆయన ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.


Also Read : సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్






సుబ్బరాజు, శ్రియా శరణ్ కూడా!
ముదుగంటి క్రియేషన్స్‌ పతాకంపై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విఎస్‌ జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలుగులోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నాగేంద్ర కుమార్‌ కళా దర్శకుడు. ఈ సినిమాలో సుబ్బరాజు, శ్రియా శరణ్ కూడా నటిస్తున్నట్లు తెలిపారు. 


Also Read సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'



తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ 'జితేందర్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కథా నేపథ్యం ఈ సినిమాపై ఆసక్తి పెంచడానికి ఓ కారణం అయితే... ప్రేమ కథలతో ఫేమస్‌ అయిన విరించి వర్మ ఒక్కసారిగా రూటు మార్చి, రాజకీయ నేపథ్యంలో ఓ నాయకుడి బయోపిక్ ఎంపిక చేసుకోవడం మరో కారణం. ఆయన పొలిటికల్ బేస్డ్ స్టోరీ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఈ సినిమాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial