Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం కుటుంబ సభ్యులు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రాకేష్ మాస్టర్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఎన్నో వీడియోలు అప్లోడ్ చేశారు. అలాగే ఎన్నో చానళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో రాకేష్ మాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయం అయ్యాయి. గతంలో ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర ఎలా ఉండాలి, సమాధి ఎక్కడ ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 


సమాధి కోసం వేప చెట్టు


రాకేష్ మాస్టర్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుండేవారు. అలాగే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తాను చనిపోయాక ఏమి చేయాలో ముందే చెప్పారు. అందుకోసం స్మశానంలోనే ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘నేను చనిపోత నన్ను ఎలా సమాధి చేయాలో చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా’’ అని తెలిపారు. తాను చనిపోయిన తర్వాత తన అస్తికలను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పారు రాకేష్ మాస్టర్. అందుకోసం ఓ స్థలాన్ని సేకరించి అక్కడ ఓ వేప చెట్టును నాటారు. తాను చనిపోయిన తర్వాత తన అస్తికలను ఆ వేప చెట్టు కిందే సమాధి చేయాలని చెప్పారు. అప్పుడే తన ఆత్మ ప్రశాంతంగా ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుందన్నారు. రాకేష్ మాస్టర్ ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


చనిపోతారని రెండు నెలలు ముందే తెలుసా?


రాకేష్ మాస్టర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆయన బతకడం కష్టమని రెండు నెలల క్రితమే వైద్యులు చెప్పారట. గతంలో ఆయన ‘హనుమాన్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలోనే రక్తపు వాంతులు, విరేచనాలు అయ్యాయని చెప్పారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారన్నారు. వైద్యులు చెప్పిన తర్వాత కొంతకాలం మందుకు దూరంగా ఉన్న ఆయన కొంతమంది సన్నిహితులు బలవంతంలో మళ్లీ మొదలుపెట్టారని అన్నారు. అయితే ఇటీవల రక్తపు విరేచనాలు ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారని, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని వెైద్యులు చెప్పారని అన్నారు. ఆదివారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే తుదిశ్వాస విడిచారని చెప్పుకొచ్చారు. 


రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ఆయన 1968 సంవత్సరంలో తిరుపతిలో జన్మించారు. ‘ఆట’, ‘ఢీ’ వంటి పాపులర్ డ్యాన్స్‌ రియాల్టీ షోల ద్వారా ఆయన కెరీర్‌ ను ప్రారంభించారు. తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు 1500 సినిమాలకు రాకేష్ కొరియోగ్రాఫర్‌ గా చేశారు. ప్రస్తుతం తెలుగులో టాప్ కొరియో‌గ్రాఫర్‌ లుగా కొనసాగుతోన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య వంటి సినిమాల్లో కొన్ని పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు.


Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!