జోయా అక్తర్ దర్శకత్వంలో స్టార్-కిడ్స్ సుహానా ఖాన్ (షారూఖ్ ఖాన్ కుమార్తె), ఖుషీ కపూర్ (శ్రీదేవి కుమార్తె), అగస్త్య నంద (అమితాబ్ మనువడు) అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ది ఆర్చీస్’. నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. 1964వ సంవత్సరంలో జరిగిన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొండ ప్రాంత పట్టణం సెట్ లో ఈ సినిమాను రూపొందించారు. రాక్ ఎన్ రోల్ సంగీతం నుంచి, స్నేహం, ప్రేమ, బ్రేకప్ వరకు ఇందులో చూపించారు. ఈ చిత్రం భావోద్వేగంతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే, ఈ చిత్రంతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.

   


పాత రోజుల్ని గుర్తు చేసిన ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌


అబ్బాయిలు, అమ్మాయిలు టీనేజ్ లో కల్మషం లేని జీవితాన్ని కొనసాగిస్తున్న దృశ్యంతో ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌ ప్రారంభం అయ్యింది.  కాస్ట్యూమ్స్, సెట్స్ సినిమాకు రెట్రో లుక్‌ని ఇచ్చాయి. ఇందులో కనిపించే వాళ్లంతా విద్యార్థులే . వాళ్లు బయట కూడా పలు సాహసాలు చేస్తున్నట్లు చూపించారు. మిహిర్ అహుజా, డాట్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండాతో సహా యువ నటీనటులు ఇందులో కనిపించారు. బ్యాక్‌ గ్రౌండ్‌లోని సంగీతం చక్కటి ట్యూన్‌ తో ఆకట్టుకుంటోంది.  60వ దశకంలోని కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా చూపించబోతోంది. చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.   






‘ది ఆర్చీస్’ టీమ్ కు షారుఖ్ ఆల్ ది బెస్ట్


తాజాగా ‘ది ఆర్చీస్’ సినిమా కొత్త పోస్టర్ ను  సుహానా ఖాన్  తండ్రి షారూఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.“నేను చిన్నతనంలో నా ఆర్చీస్ డైజెస్ట్‌ ను అద్దెకు తీసుకోవడానికి ముందుగానే బుక్ చేసుకునేవాడిని నాకు గుర్తుంది. ఈ చిత్రంలో బిగ్ మూస్ కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను! ఈ చిత్రంలో భాగస్వాములైన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు. ‘ది ఆర్చీస్’ గత సంవత్సరం ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వచ్చింది. నిర్మాత రీమా కగ్టి ఈ సినిమా షూటింగ్ గురించి ప్రకటన చేస్తూ స్లేట్‌ను షేర్ చేశారు. “షూట్ ప్రారంభం అయ్యింది. మీ కొత్త స్నేహితులను కలవండి. అద్భుతమైన జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ తారాగణాన్ని పరిచయం చేస్తున్నా” అంటూ ప్రకటించారు.


ఈ సినిమా నేటి యువకుల జీవితాలకు ప్రతిరూపం 


ఈ సినిమా గురించి డైరెక్టర్ జోయా అక్తర్ కీలక విషయాలు వెల్లడించారు. “ఆర్చీస్‌కు ప్రాణం పోసే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది అందరి బాల్యం, యుక్త వయస్సులో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ మూవీలోని పాత్రలు ఐకానిక్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యారెక్టర్లను తీర్చిదిద్దేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సినిమా నేటి యువకుల జీవితాను ప్రతిధ్వనిస్తుందని నేను భావిస్తున్నాను” అని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.  


Read Also: డిజాస్టర్ మూవీస్ కంటే తక్కువ రేటింగ్, ‘ఆదిపురుష్’ చిత్రానికి IMDb షాక్!