నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రయాణంలో 'పెళ్లి పుస్తకం' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాలోని 'శ్రీరస్తు శుభమస్తు' పాట ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో జరిగే పెళ్లిల్లో వినబడుతుంది. ఆ సినిమాతో పూజా కార్యక్రమాలతో కొత్తగా ప్రారంభమైన సినిమాను కంపేర్ చేశారు రాజేంద్ర ప్రసాద్. 'పెళ్లి పుస్తకం' స్థాయి సినిమా 'లగ్గం' అని ఆయన చెప్పారు. ఇంతకీ, 'లగ్గం' ఏమిటని అనుకుంటున్నారా!? పూర్తి వివరాల్లోకి వెళితే...
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'లగ్గం'
'ప్రెజర్ కుక్కర్', '#బ్రో', 'ఓదెల రైల్వే స్టేషన్', 'రాజయోగం', 'పాప్ కార్న్', 'సర్కిల్' సినిమాలు చేసిన యువ కథానాయకుడు సాయి రోనక్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'లగ్గం'. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగులో 'రుద్రంగి', కన్నడలో శివ రాజ్ కుమార్ 'వేద' సినిమాలు చేసిన గానవి లక్ష్మణ్ హీరోయిన్.
'లగ్గం' చిత్రాన్ని సుభిశి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వేణుగోపాల్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల రచన, దర్శకత్వంలో రూపొందుతోంది. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
అంత గొప్ప పాత్ర మళ్లీ చేస్తున్నా - రాజేంద్ర ప్రసాద్
'లగ్గం' సినిమా ప్రారంభోత్సవంలో డా . రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... ''నేను ఈ 'లగ్గం' సినిమాలో ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషిస్తున్నా. నటుడిగా నా ప్రయాణంలో 'పెళ్లి పుస్తకం' తర్వాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో నాకు లభించింది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికీ 'లగ్గం' కథ, కథనాలు కనెక్ట్ అవుతాయి. లగ్గం విందు భోజనం లాంటి సినిమా'' అని అన్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశామని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
Also Read: నాకు నేను విపరీతంగా నచ్చా - 'ఈగల్'పై మాస్ మహారాజా కాన్ఫిడెన్స్ చూస్తుంటే...
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ... "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు, రెండు మనసులు కలవడం అనే చెప్పే కథతో తెలుగు ప్రేక్షకులు అందరికీ గట్టి దావత్ ఇవ్వబోతున్నాం'' అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ''ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. మా 'లగ్గం'లో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లిలో సంస్కృతి సంప్రదాయాలు చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల లగ్గాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ ఇంకా పెళ్లి కాకపోతే... వారికి ఇలా 'లగ్గం' చేసుకోవాలని అనిపిస్తుంది" అని అన్నారు.
Also Read: రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?
సాయి రోనక్, గానవి లక్ష్మణ్ జంటగా... నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లగ్గం' సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు, రఘుబాబు, 'రచ్చ' రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, 'చమ్మక్' చంద్ర, 'చిత్రం' శ్రీను, సంధ్య, 'ఆర్ఎక్స్ 100' & 'మంగళవారం' ఫేమ్ లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, 'కేరాఫ్ కంచరపాలెం' రాజు, సత్తన్న తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఇంకా 'లగ్గం' చిత్రానికి కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, రచన - దర్శకత్వం: రమేష్ చెప్పాల.