'మార్గశిర మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి' - మాస్ మహారాజా రవితేజ క్యారెక్టర్ గురించి 'ఈగల్'లో నవదీప్ చెప్పిన డైలాగ్ ఆ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అయ్యింది. మరి, సినిమా ఎలా ఉండబోతుంది? తెలియాలి అంటే ఈ శుక్రవారం వరకు వెయిట్ చేయాలి. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన 'ఈగల్' శుక్రవారం విడుదల అవుతోంది. మరి, ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ఏం చెప్పారు? ఆయన రివ్యూ ఎలా ఉందో? చదవండి. 


నాకు నేను విపరీతంగా నచ్చాను - రవితేజ
'ఈగల్' సినిమాలో తన గెటప్ తనకు బాగా నచ్చిందని రవితేజ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు నేను విపరీతంగా నచ్చాను. ఆ గెటప్ కోసం రెండు మూడు నెలలు పట్టింది. సిల్వర్ స్క్రీన్ మీద చూడటం కోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఇటువంటి మేకోవర్ ట్రై చేశా. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగ్... ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్ చూడటం కోసం! నేను కూడా వెయిటింగ్! ఎందుకంటే... నేను అవుట్ డోర్ షూటింగ్ నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ వచ్చా. ఈసారి సౌండ్ తో కార్తీక్ ఘట్టమనేని నాకు సినిమా చూపించబోతున్నాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మీద దర్శకుడికి విపరీతమైన నమ్మకం. అతడు రాక్ స్టార్. అతను చేసిన రీ రికార్డింగ్ ఆల్మోస్ట్ విన్నాను. ఫైనల్ మిక్సింగ్ వినబోతున్నా. అతను ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి'' అని చెప్పారు.


కథ నడిపించేది అనుపమ క్యారెక్టర్!
'ఈగల్' సినిమాలో ఇద్దరు అందాల భామలు అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటించారు. వాళ్లిద్దరి గురించి రవితేజ మాట్లాడుతూ... ''సినిమాలో కథ నడిపించేది అనుపమ క్యారెక్టర్. ఆ అమ్మాయి ద్వారా సినిమా మొత్తం నడుస్తుంది. ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. కావ్యా థాపర్ లవ్లీ క్యారెక్టర్ చేసింది. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్'' అని చెప్పారు. సినిమా సక్సెస్ అయ్యి కార్తీక్ ఘట్టమనేనికి చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని రవితేజ ఆకాంక్షించారు.  


ఆ చిన్నారి పాత్రతో చిన్న పిల్లలు కనెక్ట్ అవుతారు!
'ఈగల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ ఒక క్యారెక్టర్ చేశారు. అతని పాత్రతో చిన్న పిల్లలు కనెక్ట్ అవుతారని రవితేజ చెప్పారు. అంతకు మించి చెప్పడం తనకు ఇష్టం లేదని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మణిబాబు కరణం డైలాగులు మామూలుగా లేవు, అతని గురించి చాలాసార్లు చెప్పానని, ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసి చెబుతారని రవితేజ తెలిపారు. తన టాలెంట్ ఈ సినిమాతో బయట పడుతుందని ఆయన పేర్కొన్నారు.


Also Read: రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తనకు హోమ్ బ్యానర్ లాంటిదని రవితేజ చెప్పారు. తనతో ఎన్ని సినిమాలు చేయడానికి అయినా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గారు రెడీ అంటున్నారని, వాళ్లిద్దరూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని, లోపల ఒకటి బయట మరొకటి ఉండదని, తాను కూడా వాళ్లతో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని రవితేజ తెలిపారు.


Also Readనేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!