Rajendra Prasad Apology To David Warner: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల 'రాబిన్ హుడ్' (Robinhood) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్‌పై ఆయన చేసిన కామెంట్స్‌పై విమర్శలు రాగా.. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. 

ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్

తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. సరదాగా తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని రాజేంద్రప్రసాద్ అన్నారు. 'ఐలవ్ డేవిడ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్. డేవిడ్ వార్నర్ మన సినిమాలు, నటనను ఇష్టపడతారు. ఈ సినిమాతో ఒకళ్లకు ఒకళ్లం బాగా క్లోజ్ అయిపోయాం. నితిన్, వార్నర్ నాకు పిల్లల్లాంటివారు. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుంటాను.' అంటూ వీడియోలో చెప్పారు.

Also Read: అమ్మాయిని బంధించిన ఆత్మలు... పిల్ల కోసం తల్లి వెళితే... డైరెక్ట్‌గా ఓటీటీలోకి హారర్ సినిమా సీక్వెల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అసలెందుకు సారీ చెప్పారంటే..?

'రాబిన్ హుడ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు. ఆయన ఈ మూవీలో గెస్ట్ రోల్ చేశారు. ఈ వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ సైతం ప్రసంగించారు. ఈ సందర్భంగా వార్నర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వార్నర్ క్రికెట్‌ ఆడమంటే పుష్ప సినిమాలో స్టెప్పులు వేస్తున్నాడంటూ తెలిపారు. 'దొంగ.... కొడుకు మామూలోడు కాదండీ వీడు. ఏయ్ వార్నరూ.. బీ వార్నింగ్' అంటూ కామెంట్ చేశారు. అయితే, తెలుగు తెలియని వార్నర్ ఈ వ్యాఖ్యలకు సరదాగా నవ్వుకున్నారు.

ఈ కామెంట్స్ రాజేంద్రప్రసాద్ సరదాగానే చేసినా సోషల్ మీడియాలో వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్నర్.. తెలుగు సంస్కృతి, సినిమాలను చాలా ఇష్ట పడతారని.. అలాంటి వ్యక్తిని అవమానించడం ఏంటి.? అంటూ ప్రశ్నించారు. ఆయన సినిమాపై అభిమానంతో ప్రత్యేక అతిథిగా ఈవెంట్‌కు వచ్చారని.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొందరు విమర్శించారు. అయితే, కొందరు మాత్రం వార్నర్‌కు, ఆయనకు మధ్య ఉన్న చనువుతో అలా అని ఉండొచ్చని.. దానికి వివాదం చేయాల్సిన అవసరం ఏంటని కామెంట్ చేశారు. దీనిపై చర్చ సాగుతుండగా.. తాజాగా రాజేంద్ర ప్రసాద్.. తన కామెంట్స్ పట్ల క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.

ఈ నెల 28న రిలీజ్

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుండగా.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.