ఒకప్పటి హీరోయిన్, నిర్మాత ఛార్మీ కౌర్ (Charmy Kaur) సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆదివారం (సెప్టెంబర్ 4న) వెల్లడించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' ఫ్లాప్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో... అంత కంటే ఎక్కువ విమర్శలు  ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీపై కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు ఛార్మి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె రూటులో రాశీ ఖన్నా వెళ్లారు. అయితే, ఒక ట్విస్ట్ ఉంది. 


Raashi Khanna deactivated her twitter account : సోషల్ మీడియా హ్యాండిల్స్ విషయంలో రాశీ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఛార్మీ కౌర్ తరహాలో పూర్తిగా బ్రేక్ ఇవ్వడం లేదు. ట్విట్ట‌ర్‌కు మాత్రం దూరం అవుతున్నారు. అవును... రాశీ ఖన్నా నుంచి ఇకపై ట్వీట్స్ ఉండవు. తన ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశీ ఖన్నా వెల్లడించారు. 


ట్విట్ట‌ర్‌కు దూరమైనా... ఇన్‌స్టాలో!
రాశీ ఖన్నా అభిమానులకు శుభవార్త ఏంటంటే... ట్విట్ట‌ర్‌కు దూరమైనా సరే, మరో సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు, ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్నారు. అయితే, ఎందుకు రాశీ ఖన్నా ట్విట్ట‌ర్‌కు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నారు? అనేది ఆమె చెప్పలేదు.


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


శర్వా, రాశీ సినిమా షురూ!
యువ కథానాయకుడు శర్వానంద్‌కు జంటగా రాశీ ఖన్నా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. శర్వాకు 33వ చిత్రమిది. రచయిత, దర్శకుడు కృష్ణచైతన్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. 


Sharwanand and Raashi Khanna's Film Launched : శర్వా 33 ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌ ఇవ్వగా... తొలి సన్నివేశానికి కృష్ణచైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ అందజేశారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని నిర్మాత తెలిపారు. ఇందులో శర్వానంద్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. 


శర్వానంద్ సినిమా కాకుండా ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన 'సర్దార్', హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా 'యోధ' సినిమాల్లో రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన 'పక్కా కమర్షియల్', 'తిరు' సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగు 'పక్కా కమర్షియల్' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ధనుష్ 'తిరు' తమిళనాట మంచి వసూళ్లు సాధించింది. అందులో రాశీ ఖన్నాది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి పేరు వచ్చింది.  




Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్