Producer TG Vishwa Prasad Reaction On Tollywood Industry Disputes: టాలీవుడ్ ఇండస్ట్రీని, కార్మికులను తక్కువ చేసి మాట్లాడారంటూ వస్తోన్న విమర్శలపై ప్రముఖ ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ, హైదరాబాద్ టాలెంట్, ఎంట్రీ ఫీజులపై నా స్పష్టమైన అభిప్రాయం ఇదే అంటూ ఆయన ఓ లెటర్ రిలీజ్ చేశారు.
వ్యవస్థపై మాత్రమే...
తన విమర్శలు వ్యవస్థపై మాత్రమేనని... టాలెంట్‌పై కాదంటూ స్పష్టం చేశారు విశ్వప్రసాద్. 'హైదరాబాద్‌లో అపారమైన టాలెంట్ ఉంది. మా ప్రొడక్షన్లలోనే 60 నుంచి 70 శాతం టీం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇండస్ట్రీ అభివృద్ధికి వీరి రోల్ ఎంతో కీలకం. గతంలో 10 శాతం ఉన్న స్కిల్ గ్యాప్ ఇప్పుడు 40 శాతం వరకూ పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు. కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులను ఇండస్ట్రీలోకి రానివ్వకుండా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ వసూలు చేసే గ్రూపుల వల్లే. నిజమైన టాలెంట్, స్కిల్ ఉన్న వాళ్లకు ఇది ప్రధాన అడ్డంకి.' అంటూ పేర్కొన్నారు.
అందుకే మాట్లాడాను
కొత్త టాలెంట్ రాకుండా అడ్డుకుంటూ... కేవలం తమ సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించే గ్రూపులపైనే తాను మాట్లాడినట్లు ప్రసాద్ తెలిపారు. ఇది ఇండస్ట్రీ లాంగ్ జర్నీలో చాలా నష్టదాయకం అవుతుందన్నారు.
Also Read: సార్... నేను మీకు డై హార్డ్ ఫ్యాన్ - 'మయసభ' సిరీస్‌లో ఎన్టీఆర్‌తో కేసీఆర్?... ఆ సీన్ వేరే లెవల్
టాలెంట్‌కు సపోర్ట్
ఇప్పటికే మెజార్టీ టీం హైదరాబాద్ నుంచే వస్తోందని... మిగిలిన గ్యాప్ కూడా ఇక్కడి టాలెంట్‌తోనే నింపాలంటూ విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. 'టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు కల్పించాలి. బాహ్య నియామకాలపై ఆధార పడకుండా ఇక్కడి టాలెంట్‌కే మద్దతుగా ఉండాలి. నేను హైదరాబాద్ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపైనే, టాలెంట్‌పై కాదు.' అని పేర్కొన్నారు.
ఆ వ్యవస్థల్ని తొలగించాలి
హైదరాబాద్‌లో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పటి నుంచో అండగా ఉన్నారని... వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలన్నారు విశ్వ ప్రసాద్. 'ఇక్కడ మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. లోకల్ టాలెంట్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలి. వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం.' అంటూ స్పష్టం చేశారు.
ప్రస్తుతం విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
అంతకు ముందు విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ ఫెడరేషన్ అభ్యంతరం తెలిపింది. ఇక్కడ టాలెంట్ లేదనేలా ఆయన మాట్లాడారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో విశ్వప్రసాద్ తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు మలయాళంలో కేవలం రూ.కోటి బడ్జెట్‌తో తీసే సినిమా తెలుగులో తీయాలంటే రూ.15 కోట్లు అవుతుందంటూ కామెంట్స్ చేశారు. 'మలయాళంలో నటీనటులు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ రెమ్యునరేషన్స్ తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఇక్కడ భారీ రెమ్యునరేషన్స్, కార్మికుల జీతాలు ఎక్కువగా ఉండడంతో బడ్జెట్ భారీగా పెరుగుతుంది.' అని అన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.