SKN controversial comments : తమిళ మూవీ 'డ్రాగన్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస్ కుమార్) షాకింగ్ కామెంట్స్ చేశారు. "తెలుగు హీరోయిన్లని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది" అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు హీరోయిన్లపై ఎస్కేఎన్ కామెంట్స్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత ఎస్కేఎన్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ "తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగురాని అమ్మాయిలని మేము ఎక్కువగా ఇష్టపడతాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని నేను, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నాము' అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
హీరోయిన్ పేరుపై కూడా సెటైర్లు
ఇక 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే ఈ సినిమాలో హీరోయిన్ పేరుపై కూడా వెరైటీ సెటైర్లు పేల్చారు ఎస్కేఎన్. ఇందులో హీరోయిన్ పేరు కాయదు లోహల్. ఆమె గురించి ఎస్కేఎన్ మాట్లాడుతూ "కాయలా? పండ్లా?... తెలుగులో కాయలు, పండ్లకు డిఫరెంట్ అర్ధాలు ఉంటాయి. అవి కూడా మంచి అర్థాలే" అంటూ చెప్పుకొచ్చారు. అయితే హీరోయిన్ పై ఆయన పేల్చిన సెటైర్ కంటే, "తెలుగు రాని అమ్మాయిల్ని ఎక్కువ లవ్ చేస్తాము. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తెలిసి వచ్చింది" అంటూ ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు కూడా చూస్తారు
'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూవీ 'డ్రాగన్'. ఇందులో అనుపమ పరమేశ్వరన్ తో పాటు కాయద్ లోహల్ హీరోయిన్లుగా నటించారు. ఈ కామెడీ డ్రామా మూవీకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రిలీజ్ ఈవెంట్ లోనే డైరెక్టర్ హరీష్ శంకర్ "తెలుగు వాళ్ళు తెలుగు తప్ప అన్ని సినిమాలను చూస్తారు" అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఎస్కేఎన్ "మనవాళ్లు మన సినిమాలు కూడా చూస్తారు అన్నా" అంటూ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కంటే ఎక్కువగా అటు హరీష్ శంకర్, ఇటు ఎస్కేఎన్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!