సినిమా ఇండస్ట్రీలో ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన  గత కొన్నేళ్లుగా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో వందలాది మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయిస్తూ వస్తున్నారు. ఆయన స్థాపించిన ఈ ఫౌండేషన్ ఎంతో మంది చిన్నారుల గుండెకు భరోసానిచ్చింది. అతి చిన్న వయసులో గుండె సంబంధిత జబ్బుతో బాధపడే నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు అందించి వారి కుటుంబాలలో వెలుగు నింపుతున్నారు మహేష్ ఆయన భార్య నమ్రత. ఎంతో కాలం నుంచే ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఈ మధ్య కాలంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో మహేష్ అభిమాలతోపాటు ఎంతో మంది ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మహేష్ తన ఫౌండేషన్ ద్వారా మరో చిన్నారి గుండెకు ప్రాణం పోశారు. ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకొని ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని స్టార్ నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 


అయితే ఆ చిన్నారి గుండె ఆపరేషన్ వెనుక జరిగన కథను నాగవంశీ తను పోస్ట్ చేసిన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. కొన్ని వారాల క్రితం తన సన్నిహితుల్లో ఒకరు తనకు ఫోన్ చేశారని అన్నారు. ఆయన తనకు తెలసిన ఓ నిరుపేద కుటుంబం ఉందని, వారు తమ పాప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, అయితే ఆపరేషన్ చేయించడానికి వారి వద్ద అంత డబ్బులేదని, ఎంబీ ఫౌండేషన్ ను ఎలా రీచ్ అవ్వాలో తనను అడిగాడని నాగవంశీ చెప్పారు. వెంటనే తాను ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతకు ఫోన్ చేసి చెప్పానని, ఆమె వెంటనే ఎంబీ ఫౌండేషన్ వారితో మాట్లాడారని అన్నారు. ‘‘రెండు వారాల తర్వాత ఆ పాప తల్లిదండ్రుల నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. పాపకు ఆపరేషన్ చేశారు. పాప క్షేమంగా ఉంది, మేం మహేష్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని చెప్పారని చెప్పుకొచ్చారు నాగవంశీ. ఇలాంటి ఎంతో మంది కుటుంబాల దీవెనలు సూపర్ స్టార్ కుటుంబాన్ని మరింత ప్రకాశవంతంగా ఉంచుతాయి అంటూ ట్వీట్ చేశారు నాగవంశీ. ఈ పోస్ట్ తో పాటు ఆపరేషన్ తర్వాత క్షేమంగా ఉన్న ఆ చిన్నారి ఫోటోను కూడా షేర్ చేశారాయన. దీంతో ఈ పోస్ట్ చూసి మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా దర్శకుడు త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీను సితార ఎంటర్టైన్మెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబో లో వచ్చిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమా పై మహేష్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో కలసి ఓ భారీ ప్రాజెక్టులో భాగం కానున్నారు.


Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్