Producer Bunny Vas Strong Warning To Thandel Piracy Movie Downloaders: నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' (Thandel) మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాను పైరసీ భూతం వేధిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టెక్నాలజీ పెరిగేకొద్దీ పైరసీ అంతకంతకూ విస్తరిస్తోంది. ఈ నెల 7న థియేటర్లలోకి వచ్చిన 'తండేల్'ను కొందరు పైరసీ చేసి ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేశారు. దీంతో కొందరు యథేచ్ఛగా సినిమాను వైబ్ సైట్స్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పైరసీ కాపీనీ చూసేస్తున్నారు. ఓ లోకల్ ఛానల్‌లోనూ ప్రసారం కావడం గమనార్హం. అలాగే, తాజాగా ఓ ఆర్టీసీ బస్సులోనూ పైరసీ కాపీనీ ప్రదర్శించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే, తమ చిత్రం పైరసీ కావడంపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) స్పందించారు.
'అలాంటి వారిని వదిలిపెట్టం'
సినిమా పైరసీ వస్తోంది.. చూసేద్దామని చాలా మంది అనుకుంటారని.. అలాంటి వారిని వదిలిపెట్టమని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు. తమ 'గీత గోవిందం' సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పారు. ''గీతా ఆర్ట్స్' సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్ లోడ్ చేసుకుని చూసిన వారిని అంత తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసే వారు ఎక్కడ కనిపించినా కేసులు పెడతాను. ఇప్పటివరకూ సక్సెస్ మూడ్‌లో ఉన్నాం. ఇకపై పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతాం.' అని వాసు స్పష్టం చేశారు.
కాగా, సక్సెస్ టూర్‌లో భాగంగా హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, బన్నీ వాసు తదితరులు విజయవాడ, ఏలూరు వెళ్లారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అనంతరం మీడియాతో మూవీ టీం ముచ్చటించింది. చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చానని.. తండేల్ సక్సెస్ టూర్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: 'చైతన్యను చూసి ఓ తండ్రిగా గర్వపడుతున్నా' - 'తండేల్' విజయంపై నాగార్జున ఆసక్తికర పోస్ట్
3 రోజుల్లో కలెక్షన్ల సునామీ
కాగా, 'తండేల్' (Thandel) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించగా.. తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.62.37 కోట్ల గ్రాస్ అందుకుంది. తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. రెండో రోజు సైతం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. మూడో రోజు సైతం అదే జోరు కొనసాగించింది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. అటు, యూస్‌లోనూ 'తండేల్' వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే $550K మార్కును దాటింది. మొదటి వారంలో ఈ కలెక్షన్లు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసిన చిరంజీవి.. హారర్ హిట్స్ ఇచ్చిన అమ్మాయికి పోలీస్ రోల్