సీరియల్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల తిరుమలలో ఓ ప్రాంక్ వీడియోను తీసి, వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేదాక వెళ్లడంతో తాజాగా ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఆ విషయం గురించి స్పందిస్తూ, అందరికీ సారీ చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రియాంక జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కలిసి రిలీజ్ చేసిన వీడియోలో వాళ్లిద్దరూ మాట్లాడుతూ "మేము చేసిన ఒక బ్లాగ్ శ్రీవారి భక్తులను హర్ట్ చేస్తుందని ఊహించలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ వీడియో ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఈ వీడియో వల్ల ఇంతమంది హర్ట్ అవుతారనే విషయం తెలిస్తే చేసేవాళ్ళం కాదు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చాలని అనుకోలేదు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అంతే కాకుండా భక్తులలో భయం కలగడానికి ఆ వీడియో చేయలేదు. మేము ఇద్దరం శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులం. ఆ విషయం మీకు కూడా తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు, టీటీడీ పవిత్రను దెబ్బ తీయాలనే ఆలోచనతో ఈ వీడియోను మేము చేయలేదు. తెలియకుండా చేసిన ఈ తప్పును అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాము. ఆ వీడియో వల్ల మనోభావాలు దెబ్బ తిన్న ప్రతి ఒక్కరికి, శ్రీవారి భక్తులందరికీ ఈ సందర్భంగా మరొకసారి సారీ చెప్తున్నాము. సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేసే ప్రతీ వీడియో మిమ్మల్ని ఎంటర్టైనర్ చేయడానికి మాత్రమే. ఇలా జరిగి ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము" అంటూ ఆ వీడియోలో వెల్లడించారు.
అసలు వివాదం ఏమిటంటే... బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్, శివ కుమార్ రీసెంట్ గా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే నడక మార్గంలో ఉన్న ఏడో మైలురాయి వద్ద పులి అంటూ ఫ్రాంక్ వీడియోను చేశారు. అయితే అనుకోని విధంగా ఈ వీడియో వైరల్ గా మారడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. అలాగే శ్రీవారి భక్తులు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. పవిత్రమైన తిరుమలకు వచ్చి ఇలాంటి పనులు చేయడమేంటి అంటూ వీరిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక జైన్, శివ దీనిపై వీడియోను రిలీజ్ చేసి, తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ, ఎవ్వరి మనోభావాలను దెబ్బతీసే ఆలోచన తమకు లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ప్రియాంక జైన్ మౌనరాగం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ లో నటించి, బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి టాప్-5లో నిలిచింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది ప్రియాంక. గత కొన్నేళ్లుగా వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అలాగే ఇద్దరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.