Pushpa 2 Movie Ticket Price | అమరావతి: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమాకు ఇదివరకే తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం పుష్ప2 టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి పుష్ప 2 ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మూవీ యూనిట్‌కు శుభవార్త చెప్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రానికి ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి వచ్చింది. తెలంగాణ కంటే ఏపీలో టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.


ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు


పుష్ప 2 విడుదలకు ముందు రోజు డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్ షో, అర్ధరాత్రి ఒంటి గంట షోకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఏపీలో డిసెంబర్ 4న ప్రీమియర్ షో టికెట్ పై మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.800, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అనుమతులు వచ్చి, ఏపీలో రాకపోవడంతో నెలకొన్న సందేహాలకు తాజా నిర్ణయంతో చెక్ పెట్టారు.


పుష్ప2 రిలీజ్ రోజు డిసెంబర్ 5న 6 షోలకు ఏపీలో అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో లోయర్‌ క్లాస్‌ టికెట్ జీఎస్టీతో కలిపి రూ.100 వరకు, అప్పర్‌ క్లాస్‌ టికెట్ అయితే రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.200 పెంచుతూ అనుమతి లభించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు 5 షోలకు అనుమతి రాగా,  పెంచిన టికెట్‌ ధరలు ఆరోజు వరకూ అమల్లో ఉండనున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 వేల థియేటర్లలో పుష్ప 2 విడుదల కానుంది.




చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అల్లు అర్జున్ థ్యాంక్స్
ఏపీలో తన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పుష్ప 2 సినిమా కోసం ఇచ్చిన అనుమతులు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కమిట్మెంట్ కు నిదర్శనం అని రాసుకొచ్చారు.







Also Read: Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది