ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ హీరోయిన్, ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). చిలుకూరు బాలాజీ దేవాలయానికి (Chilkur Balaji Temple) వెళ్లిన ఆవిడ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రియాంక చోప్రా
''శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాను. మనం అంతా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో శాంతిని చూడాలని కోరుకుంటున్నాను. ఆ భగవత్ స్వరూపుని అనుగ్రహం అనంతం'' అని ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.
చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రియాంక చోప్రా దర్శనం వెనుక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన ఉన్నారు. తన పోస్టులో ఉపాసన (Upasana Kamineni Konidela)కు ప్రియాంక చోప్రా థాంక్స్ చెప్పారు.
రామ్ చరణ్ తొలి హిందీ సినిమా 'జంజీర్'లో ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీలో ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ తెలుగులో 'తుఫాన్'గా విడుదల అయ్యింది. అప్పటి నుంచి రామ్ చరణ్ కుటుంబంతో ప్రియాంకకు స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. సినిమాలతో సంబంధం లేకుండా స్నేహం కొనసాగుతోంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు...' పాట ఆస్కార్ సాధించినప్పుడు చిత్ర బృందమంతా అమెరికా వెళ్ళింది. అక్కడ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ప్రియాంక కొన్ని రోజులు ఆతిథ్యం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా హైదరాబాద్ రావడం వెనుక ఉన్న కారణం టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసినదే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాంటింగ్ సినిమా SSMB29లో ప్రియాంక చోప్రాను కథానాయికగా తీసుకున్నారు. ఆ సినిమా పనుల నిమిత్తం ఇటీవల ఆవిడ హైదరాబాద్ వచ్చారు. రాజమౌళితో తన క్యారెక్టర్ సినిమా గురించి డిస్కస్ చేశారని సమాచారం అందుతోంది. మరి షూటింగ్ స్టార్ట్ చేశారో? లేదో? ఆల్రెడీ సినిమా ఓపెనింగ్ చేశారు. పూజ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా బయటకు రానివ్వలేదు రాజమౌళి.
ప్రియాంక చోప్రా హిందీ సినిమా చేసి ఆల్మోస్ట్ ఆరేళ్ళు అవుతోంది. 'ది స్కై ఈజ్ పింక్' తర్వాత ఆవిడ ఇండియన్ సినిమా చేయలేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన సినిమాకు ప్రియాంక యాడ్ కావడం వల్ల ఫారిన్ కంట్రీల్లో సినిమాకు మంచి డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: మనో అక్కినేని మృతి... తెలుగు అమ్మాయిని తమిళంలో డైరెక్టర్ చేసిన నిర్మాత ఇక లేరు