ప్రియదర్శి (Priyadarshi) కేవలం కమెడియన్ మాత్రమే కాదు... ఆయనలో ఒక కథానాయకుడు కూడా ఉన్నాడు. కంటెంట్ బేస్డ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా సారంగపాణి జాతకం. టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ చేశారు.
పుష్యమి నక్షత్రంలో...
ఉదయం 11:12 గంటలకు!
సున్నితమైన హాస్యం, ఆలోచింపజేసే కథ, కథనాలతో సినిమాలు తీసే దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti). ఆయన దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam Movie) రూపొందుతోంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకులు ఆదరణతో పాటు చక్కటి వసూళ్లు సాధించాయి. అందువల్ల 'సారంగపాణి జాతకం' మీద అందరిలో అంచనాలు ఉన్నాయి.
నవంబర్ 21వ తేదీన ఉదయం 11 గంటల 12 నిమిషాలకు సారంగపాణి జాతకం టీజర్ విడుదల చేయనున్నట్లు ఈరోజు అనౌన్స్ చేశారు. గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో తమ టీజర్ ప్రేక్షకులకు చూపించబోతున్నామని ప్రియదర్శి తెలిపారు. నక్షత్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే... జాతకాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
ప్రియదర్శి కోసం వచ్చిన బలగం తాత!
హీరోగా ప్రియదర్శని నటించిన సినిమాల్లో 'బలగం' ముఖ్యమైనది. ఆ చిత్రంలో తాత క్యారెక్టర్ చాలా కీలకమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాత మరణించిన తర్వాత కాకి రూపంలో వచ్చి కుటుంబ సభ్యుల పెట్టిన ఆహారం ముట్టుకోవాలని అందరూ ఎదురు చూస్తారు. ఇప్పుడు ఆ కాకిని ప్రియదర్శి కోసం 'సారంగపాణి జాతకం' యూనిట్ సభ్యులు తీసుకు వచ్చారు. వెరైటీగా టీజర్ అనౌన్స్మెంట్ వీడియో రూపొందించారు.
ప్రియదర్శితో స్టెప్పులు వేయించిన దినేష్ మాస్టర్!
'సారంగపాణి జాతకం' నుంచి మొదటి పాట 'సారంగో సారంగో'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో దానికి మంచి స్పందన లభిస్తోంది. హీరోగా ఇంతకు ముందు నటించిన సినిమాలలో ప్రియదర్శి పాటలు చేశారు. అయితే మొదటిసారి ఈ పాటలో హుక్ స్టెప్ వేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, మంజు వారియర్ జంటగా 'వేట్టయాన్' సినిమాలో చేసిన 'మనసిలాయో' పాట ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన దినేష్ మాస్టర్... 'సారంగపాణి జాతకం' సినిమాలో 'సారంగో సారంగో' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్స్ మీద రెండు గంటల పాటు ట్రాఫిక్ ఆపి మరి సాంగ్ షూటింగ్ చేశారని తెలిసింది. కృషికి తగ్గ ఫలితం లభించడంతో యూనిట్ అంతా హ్యాపీగా ఉంది. టీజర్ విడుదల తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది.
'సారంగపాణి జాతకం' సినిమాలో ప్రియదర్శి సరసన తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలోకి సినిమాను తీసుకు వస్తున్నారు.
Also Read: బికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?