Priyadarshi new Movie Title Is Sarangapani Jathakam: 'మిస్టర్ మల్లేశం', 'బలగం' చిత్రాలతో హీరో మంచి గుర్తింపు పొందాడు కమెడియన్ ప్రియదర్శి. ఇప్పుడు ఆయన హీరో సూపర్ కాంబోలో ఓ సినిమా రాబోతోంది. నేడు(ఆగస్టు 25) ప్రియదర్శి బర్త్‌డే సందర్భంగా తన కొత్త మూవీ టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఫ్యామిటీ ఎంటర్‌టైనింగ్ చిత్రాల దర్శకుడైన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఓ సినిమా రాబోతోంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్,మోహనకృష్ణ ఇంద్రగంటి హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి.
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' చిత్రాలు మంచి విజయం సాధించింది. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ప్రియదర్శి సినిమా రూపొందనుంది. ఈరోజు ప్రియదర్శి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసి ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రానికి 'సారంగపాణి జాతకం' ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మూవీ కథ గురించి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. ఇది నమ్మకం, మూడనమ్మకం నేపథ్యంలో కొనసాగే పూర్తి వినోదాత్మక చిత్రమన్నారు.
నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే 'సారంగపాణి జాతకం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పారు. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిన అ అబ్బాయి రెండిటికి చెడ్డ రేవడి అయిపోయాడా? బయట పడ్డాడా? అనేదే ఈ సినిమా కథాంశమన్నారు. ఇక చిత్రాన్ని ఉత్కంఠభరితంగా, కడుపుబ్బా నవ్వించే ఓ కామెడీ కథ చిత్రంగా రూపొందిస్తున్నామని, హీరో పాత్రలో భావోద్వేగాలను, వినోదాన్ని ప్రియదర్శి తనదైన శైలిలో అద్భుతంగా పండించాడన్నారు.
ఇక హీరోయిన్ రూప కడువయూర్ అచ్చ తెలుగు అమ్మాయిగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుందన్నారు. 'వెన్నెల' కిశోర్, వైవా హర్ష, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వీకే నరేష్, వడ్లమాని శ్రీనివాస్, శివన్నారాయణ, రూపాలత, హర్షిణీలు ఈ సినిమా ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా 'సారంగపాణి జాతకం' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా చూడగలిగే ఒక కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు అందించే శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ సినిమా విషయంలోనూ ఎక్కడ రాజీ పడలేదు. పీజీ విందా సినిమాటోగ్రాఫీ, వివేక్ సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ సాహిత్యం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
'సారంగపాణి జాతకం' పరిపూర్ణ హాస్యస్పద చిత్రమన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. జంధ్యాల గారి చిత్రంలా ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుందన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ చెప్పగానే తనకు బాగా నచ్చింది, ఇది మా ఇద్దరి కాంబోలో వచ్చే హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుందన్నారు. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయని, వివేక్ సాగర్ అద్భుతమైన బాణీలు అందించారన్నారు. ఈ సినిమాలో సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చామన్నారు. దాదాపు ఈ సినిమ 90 శాతం చిత్రీకరణ అయ్యిందని, హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశామని తెలిపారు. ఇంకా రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ మినహా సినిమా పూర్తి అయ్యిందని ఆయన పేర్కొన్నారు.