నారా రోహిత్ (Nara Rohit) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie). కొంత విరామం తర్వాత ఆయన నటించిన చిత్రమిది. దీనితో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ గురువారం (ఏప్రిల్ 25న) విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, ఈ రోజు సినిమా విడుదల వాయిదా పడినట్లు వెల్లడించారు.


'ప్రతినిధి 2' విడుదల వాయిదా వెనుక రాజకీయం!?
'ప్రతినిధి 2' విడుదల వాయిదా వేశామని, కొత్త విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే, వాయిదా వెయ్యడానికి గల కారణాలు వెల్లడించలేదు. వాయిదా పడటం వెనుక రాజకీయం ఉందని ఫిల్మ్ నగర్ గుసగుస.






రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హీరో నారా రోహిత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు స్వయానా పెదనాన్న. అందుకని, వాళ్ల పార్టీకి అనుకూలంగా సినిమా తీసి వుంటారని ప్రత్యర్థి పార్టీ నాయకులు, వాళ్ల అనుచర వర్గంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైకి చెప్పనప్పటికీ తెర వెనుక సెన్సార్ పూర్తి కాకుండా చక్రం తిప్పారట. అందువల్లే, విడుదల వాయిదా పడిందని విశ్వనీయ వర్గాల సమాచారం.


Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!



'ప్రతినిధి 2' సినిమాలో ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ సన్నివేశాలు లేవని, కానీ ఓ పార్టీ అనవసరంగా ఆందోళన చెందుతోందని 'ప్రతినిధి 2' కథ గురించి తెలిసిన వ్యక్తులు చెప్పే మాట. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... జాతిపిత మహాత్మా గాంధీ మరణించినప్పుడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని వేసిన ప్రశ్న ఓ పార్టీ అధినేత తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలకు సూటిగా తగిలిన ప్రశ్నగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


'ప్రతినిధి 2' చిత్రాన్ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ సంస్థలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యుషన్, ప్రొడక్షన్ సంస్థ అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.


Also Read'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి



నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన 'ప్రతినిధి 2' సినిమాలో సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిష్షు సేన్‌ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృథ్వీ రాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రఘు బాబు, రఘు కారుమంచి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, స్టంట్స్: శివ రాజు - పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్ పుప్పాల, సంగీతం: మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ - రానా ఆర్ట్స్, నిర్మాతలు: కుమార్‌ రాజా బత్తుల - ఆంజనేయులు శ్రీ తోట - సురేంద్రనాథ్ బొల్లినేని, దర్శకకుడు: మూర్తి దేవగుప్తపు.