Jai Hanuman - Prasanth Varma: 'హనుమాన్‌' చిన్న సినిమాగా రిలీజై ఇప్పుడు ప్రభంజనంగా మారిపోయింది. రికార్డులు సృష్టిస్తోంది. రోజుకో రికార్డు బద్దలుకొడుతోంది. ఇప్పటికే రూ.250 కోట్ల కలెక్షన్‌ దాటిపోయింది. ఇక ఇప్పుడు అందరి అంచనాలు సీక్వెల్‌ పైనే. అదే 'జై హనుమాన్‌' ప్రాజెక్ట్‌పైనే. ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్‌డేట్స్‌ ఇచ్చారు ప్రశాంత్‌వర్మ. సీక్వెల్‌లో హీరో తేజ సజ్జ కాదని, ఆంజనేయుడు అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేశారు. దానికి సంబంధించి కొత్త కొత్త అప్‌డేట్స్‌ ఇస్తూ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 'జై హనుమాన్‌'లో ఆంజనేయుడు, రాముడుగా ఎవరిని అనుకుంటున్నారో చెప్పారు.  


అదిరిపోయే అప్‌డేట్‌


'జై హనుమాన్‌'కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్‌వర్మ.. హనుమంతుడిగా మెగాస్టార్‌ చిరంజీవిగారిని అనుకుంటున్నట్లు చెప్పారు. చిరంజీవి గారిని కలుద్దాం అనుకున్నానని, ఆయనకు పద్మవిభూషణ్‌ రావడంతో బిజీగా ఉంటున్నారని, చాలామంది ఆయన్ని కలిసేందుకు వెళ్తున్నారని చెప్పారు. ఆయన ఫ్రీ టైం చూసుకుని వెళ్లి కథ చెప్తానని అన్నారు. ఇక రాముడిగా మహేశ్‌బాబు అయితే బాగుంటారని, దానికి సంబంధించి ఇప్పటికే గ్రాఫిక్‌ కూడా వేసి ఊహించుకున్నామని ప్రశాంత్‌ వర్మ చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ సినిమాకి చిరంజీవి, మహేశ్‌బాబు ఇద్దరు ఒప్పుకుంటే బాక్సాఫీస్‌ దగ్గర అది భారీ హిట్‌ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


'జై హనుమాన్‌' సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలైందని ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ప్రకటించారు. పనులు మొదలుపెట్టినట్లు ఆయన అప్‌డేట్‌ చేశారు. హనుమంతుడిగా ఎవరిని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకి జవాబుగా.. దానికోసం ఆడిషన్స్‌ చేస్తామని చెప్పారు ప్రశాంత్‌వర్మ. దీంతో దానికి సంబంధించి ఎంతోమంది పేర్లు వినిపించాయి. రానా అని, బాలీవుడ్‌ హీరోలు అని చాలా పేర్లే వినిపించాయి. ఇక ఇప్పుడు ప్రశాంత్‌వర్మ తన మనసులోని మాట బయటపెట్టేశారు.


కాగా.. గతంలో ఇదే విషయంపై మాట్లాడిన ప్రశాంత్‌ వర్మ.. హనుమంతుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో నటించే అవకాశం ఉందని అన్నాడు. మేకప్, లుక్ టెస్ట్ అన్నీ పూర్తయిన తర్వాతే ఈ పాత్రకు తగిన హీరోను సెలక్ట్ చేసుకుంటామని తెలిపాడు. ఆ హీరో పాత్రకు న్యాయం చేస్తాడని అనిపించాలని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, ఇక ‘జై హనుమాన్’లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు చాలామంది భాగం కానున్నారని రివీల్ చేశాడు.


ఇక వచ్చే ఏడాది... 2025లో సినిమాను విడుదల చేస్తామని గతంలో చిత్రబృందం చెప్పింది. 'హనుమాన్'లో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేది కథ అని ఎండింగ్ చూస్తే అర్థం అవుతోంది. ఇక హనుమాన్‌ చూసిన ప్రతి ఒక్కరు 'జై హనుమాన్' కోసం చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 'హనుమాన్‌' రికార్డులను కచ్చితంగా 'జై హనుమాన్‌' దాటేస్తుందనే నమ్మకం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రశాంత్‌ అన్న కచ్చితంగా మరో హిట్‌ ఇస్తాడు అంటున్నారు.


Also Read: 'హనుమాన్' టీమ్‌పై వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం