Animal Movie On Netflix: డిసెంబర్‌లో విడుదలయిన ‘యానిమల్’ సినిమా అన్ని విమర్శలను దాటి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా విమర్శలు ఆగడం లేదు. అంతే కాకుండా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘యానిమల్’కు ‘అన్నపూర్ణి’ తరహాలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. చాలామంది నెటిజన్లు.. ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘యానిమల్’ను ఖండిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్’ స్ట్రీమింగ్ ప్రారంభించుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ రచ్చ మొదలయ్యింది.


మరోసారి కాంట్రవర్సీలు..


రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న మూవీని ఎవరు చూస్తారు అని విమర్శించిన ప్రేక్షకులే ‘యానిమల్’ను చూడడానికి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లారు. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను అందుకుంది ‘యానిమల్’. అవార్డుల విషయంలో కూడా దూసుకుపోవడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 19 కేటగిరిల్లో సెలక్ట్ అయ్యింది ఈ చిత్రం. అంతే కాకుండా ఇందులో రణవిజయ్ సింగ్ పాత్రలో నటించిన రణబీర్ కపూర్‌కు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. ఇంతలోనే మరోసారి మూవీపై కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి.


స్ట్రీమింగ్ ఆపేయాలి..


డిసెంబర్ 26 నుంచి ‘యానిమల్’ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లిక్స్.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా మహిళలపై హింసను ఎంకరేజ్ చేసేలా ఉందని, అమ్మాయిలను అసభ్యకరంగా చూపించారని ఓటీటీ ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘యానిమల్’ను తొలగించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. భార్యను మోసం చేయడం గురించి సినిమాలో చూపించారని, అది అందరినీ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెట్టి నెట్‌ఫ్లిక్స్‌ను ట్యాగ్ చేస్తున్నారు.






‘అన్నపూర్ణి’ తరహాలోనే..


నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రానికి కూడా ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. అందులో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే సీన్స్, డైలాగ్స్ ఉన్నాయని హిందూ కమ్యూనిటీలు ధ్వజమెత్తాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్‌కు వేరే దారిలేక ఈ సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. ఇప్పుడు ‘యానిమల్’ విషయంలో కూడా నెట్‌ఫ్లిక్స్‌కు అదే ఒత్తిడి ఎదురవుతోంది. కానీ ‘యానిమల్’ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలని, అది ఎంటర్‌టైన్మెంట్ కోసం మాత్రమే అని కొందరు ‘యానిమల్’ను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్.. ‘అన్నపూర్ణి’ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ‘యానిమల్’ విషయంలో కూడా తీసుకుంటుందేమో చూడాలి.


Also Read: హాలీవుడ్ నటుడితో ‘ఎవడు’ బ్యూటీ డేటింగ్ - సినిమా స్టైల్ ప్రపోజల్, ఇంతకీ ఓకే చెప్పిందా?