Prasanth Varma: సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ ఎక్కువగా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా విజువల్స్ పరంగా ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఒక్కసారిగా స్టార్లు అయిపోయారు. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్స్ రికార్డులను సృష్టిస్తోంది. దాదాపు అందరు ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నా.. కొందరు మాత్రం దేవుడి సినిమాను డిఫరెంట్ స్టైల్‌లో తెరకెక్కించినందుకు విమర్శిస్తున్నారు. తాజాగా ‘హనుమాన్’పై వస్తున్న విమర్శలపై స్పందించాడు ఈ యంగ్ డైరెక్టర్.
ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదు..
ముందుగా ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయని గుర్తుచేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సీనియర్ ఎన్‌టీఆర్ ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారన్నాడు. కానీ ఎన్ని సినిమాలు చేసినా.. ఆయన ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదని తెలిపాడు. సీనియర్ ఎన్‌టీఆర్ చిత్రం విడుదలయ్యిందంటే చాలు.. ప్రేక్షకులు పండగ చేసుకునేవాడని గుర్తుచేశాడు. చాలామంది ప్రేక్షకులకు ఆయనే రాముడు, కృష్ణుడని అన్నాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో దేవుడి రూపంలో ఆయన ఫోటోలు ఉంటాయని చెప్పాడు. టాలీవుడ్‌లోని సినిమాల్లో దేవుళ్లను తప్పుగా చూపించలేదని, తాను ఆ జోనర్‌లో వచ్చిన సినిమాలన్నీ చూస్తానని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.
జాగ్రత్తగా తెరకెక్కించాలి..
దేవుళ్లపై తెరకెక్కించిన సినిమాల్లో కొన్ని చూసి ఎలా తీయాలో నేర్చుకుంటే.. కొన్ని చూసి ఎలా తీయకూడదో తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇలాంటివి సున్నితమైన అంశాలను, జాగ్రత్తగా తెరకెక్కించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను ఇతర దర్శకుల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని, కానీ సంస్కృతి, చరిత్రను తాను మాత్రం ఎప్పుడూ తప్పుగా చూపించను అంటూ ప్రేక్షకులకు మాటిచ్చాడు. రామాయణం, మహాభారతం గురించి నేటి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నానని, కానీ వాటిని తెరకెక్కించేంత అనుభవం తనకు లేదన్నాడు. అందుకే వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఫిక్షనల్ కథలను రాసుకున్నానని బయటపెట్టాడు.
బడ్జెట్ లేదు.. కానీ సమయం ఉంది..
తన దగ్గర ఎక్కువగా బడ్జెట్ లేకపోయినా.. సమయం ఉందని అన్నాడు ప్రశాంత్ వర్మ. అందుకే ‘హనుమాన్’ను ప్రణాళిక ప్రకారం తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు. వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ బడ్జెట్ చిత్రాలు ఎంత సమయాన్ని తీసుకుంటాయో.. అంతకంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నామని తెలిపాడు. హాలీవుడ్‌లోని సినిమాల్లో చూపించే సూపర్ పవర్స్‌కంటే మన దేవుళ్ల దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయని, అలా ఇతిహాసాల్లో ఉన్న శక్తివంతమైన పాత్రల్లో హనుమాన్ ఒకరు అని చెప్పాడు. తాను సూపర్ హీరోల సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు హనుమంతుడితోనే ప్రారంభించాలని అనుకున్నానని, అదే చేశానని తెలిపాడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ విడుదలకు ముందు మూవీని ప్రశాంత్ వర్మ ప్రమోట్ చేసిన విధానాన్ని చాలామంది ట్రోల్ చేశారు. కానీ సినిమా విడుదలయిన తర్వాత తను ప్రమోషన్‌లో చెప్పిన ప్రతీ మాట నిజమే అని ఒప్పుకుంటున్నారు.
Also Read: ఆ క్లబ్‌లో జాయిన్ అవ్వనున్న 8వ హీరోగా తేజ సజ్జా రికార్డ్ - ‘హనుమాన్’ వల్లే!