2021 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చలనచిత్ర జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్రాలకు ఎన్నడూ లేని స్థాయిలో అవార్డులు వరించాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కడం గమనార్హం. ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ ఘనంగా సన్మానించారు. అద్భుతమైన సందర్భంగా మర్చిపోలేని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు.  


రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌కు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అదే ఏడాది విడుదలైన ‘జై భీమ్’ మూవీని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడంపై తమిళ సినీ వర్గాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. తాజాగా వారి జాబితాలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా చేరారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నేషనల్ అవార్డులపై విమర్శలు గుప్పించారు. తమిళ హీరో సూర్య నిర్మించిన సామాజిక చిత్రం ‘జై భీమ్’ మూవీని గుర్తించకపోవడాన్ని ఆయన తనదైన శైలిలో తప్పుబట్టారు. 


నేషనల్ అవార్డులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ‘‘ఎవరైతే మహాత్మ హంతకుడిని సపోర్ట్ చేశారో, ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారో.. వారు ‘జై భీమ్’ను సెలబ్రేట్ చేసుకోగలరా?’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మరాఠి పద్యాన్ని కూడా షేర్ చేశారు. ‘‘జై భీమ్ అంటే కాంతి, జై భీమ్ అంటే ప్రేమ, జై భీమ్ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం.. జై భీమ్ అంటే లక్షలాది ప్రజల కన్నీళ్లు’’ అని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు అవార్డు రాలేదనే ఇలా విమర్శలు చేస్తున్నారని కొందరు.. ఆయన నిజమే చెప్పారని, సామాజిక చిత్రాన్ని గుర్తించకపోవడం ఏమిటని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 




ఆస్కార్ వరకు వెళ్లిన ‘జై భీమ్’


గతేడాది సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన జై భీమ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా దేశవ్యాప్తంగా మంచి మార్కులు కొట్టేసింది. సూర్య నటించిన ఈ సినిమాను ఆస్కార్ జూరీ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే, 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడింది. కానీ, అవార్డు దక్కలేదు. అయితే, నేషనల్ అవార్డ్స్‌లో తప్పకుండా ఈ మూవీకి గుర్తింపు లభిస్తుందని భావించారు. కానీ, తాజా ప్రకటన కోలీవుడ్‌ను నిరాశకు గురిచేసింది. 


తమిళనాడులో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా.. తెరకెక్కింది జై భీమ్ చిత్రం. అమెజాన్ లో నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి సినిమా పేరు.. మారుమోగింది. ఐఎండీబీ 250 చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. ఐఎండీబీ రేటింగ్స్  లో జై భీమ్ సినిమా 8.1 రేటింగ్‌తో నిలిచింది. ఇప్పటి వరకూ ఏ తమిళ సినిమాకు ఇంతలా రేటింగ్స్ రాలేదు.


Also Read: హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు అనుకున్నా, కానీ: తమన్నాతో ప్రేమపై విజయ్ కామెంట్స్


1995 సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. పోలీసుల కర్కశత్వాన్ని చూపిస్తూ.. బాధితురాలి తరఫున పైసా తీసుకోకుండా న్యాయవాది చంద్రు ఎలా కేసును గెలిపించాడనేది ఈ చిత్రంలో చూడొచ్చు. టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు. సినిమా చూసిన తర్వాత ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. చంద్రు, రాజన్న, సినతల్లి క్యారెక్టర్లు జనాలకు గుర్తుండిపోయేలా చేశారు. చంద్రుగా సూర్య, సినతల్లిగా లిజోమోల్ జోస్, రాజన్నగా కె.మణికందన్ వారి పాత్రల్లో జీవించేశారు.