ఇండియా, చైనా సరిహద్దుల్లో, ముఖ్యంగా గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై డ్రాగన్ ఆర్మీ చేసిన దాష్టీకాలను ఎండగడుతూ తీసిన సినిమా 'భారతీయన్స్'. ఈ చిత్రంలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లు. 


ప్రభాస్ 'ఈశ్వర్' స్క్రీన్ ప్లే రైటరే డైరెక్టర్!
'భారతీయన్స్'తో దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా', 'క‌లిసుందాం రా' తదితర హిట్ చిత్రాలకు ఆయన కథా రచయితగా పని చేశారు. ప్ర‌భాస్ కథానాయకుడిగా పరిచయమైన 'ఈశ్వర్' చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా పని చేశారు. అంతే కాదు... 'స‌ర్దుకుపోదాం రండి'కి చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, 'లాహిరి లాహిరి లాహిరిలో'కి కూడా ఆ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌద‌రితో సహ రచయితగా దీన్ రాజ్ పని చేశారు. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ సినిమాను ఈ నెల 14న తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు దీన్ రాజ్ తన అనుభవాలు తెలిపారు.


లోకల్ రౌడీ షీటర్ గొడవ చేయడంతో...
సినిమాలో అతనికి చిన్న వేషం ఇచ్చాం!
చైనా సరిహద్దుల్లో చిత్రీకరణ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అక్కడ అడవుల్లో చిత్రీకరణకు, డ్రోన్స్‌ ఉపయోగించడానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, భారత ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమతులు తీసుకున్నామని దీన్ రాజ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''వ‌ర్షాలు కురిసి, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఎప్పుడు చిత్రీకరణ ఆగిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో సినిమా చేశాం. ఒక్కోసారి మ‌ధ్యాహ్నం రెండు గంటలకు లైటింగ్ ఫెయిల్ అయ్యేది. దాంతో షూటింగ్ చేయడం కష్టమయ్యేది. ఆహరం పడకపోవడంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి. కొండ‌ చ‌రియ‌లతో పాటు కొన్ని చెట్లు విరిగి మా కార్ల‌ మీద పడ్డాయి. దాంతో కొందరు యూనిట్ సభ్యులు 'బ‌తుకు జీవుడా!' అని దొరికిన వెహికల్ ప‌ట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చేశారు. అక్కడ చిత్రీకరణ సమయంలో లోక‌ల్ కారు డ్రైవ‌ర్ తాగి గొడ‌వ చేశాడు. మాతో పాటు హైద‌రాబాద్ నుంచి ఓ మేనేజ‌ర్ అత‌న్ని కొట్టాడు. దాంతో లోక‌ల్ రౌడీ షీట‌ర్ ఎంట‌రై షూటింగ్ ఆపేస్తాన‌ని ఆవేశంతో రెచ్చిపోయాడు. అప్పటికప్పుడు అతడ్ని సముదాయించి, చిన్న వేషం ఇచ్చి ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాం. మాకు ఎదురైన ఇంకో పెద్ద సమస్య... జలగలు! అడ‌వుల్లో జ‌ల‌గ‌లు మా కాళ్ల‌ను ప‌ట్టుకుని ర‌క్తాన్ని పీల్చేవి. దాంతో దగ్గరలో ఉన్న గ్రామాల నుంచి ఉప్పు బ‌స్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్ల‌లో వేసుకుని చిత్రీకరణ కొన‌సాగించాం. సిక్కిం, సిలిగురి అడ‌వుల్లో అయితే దోమ‌ల్లాంటి కీట‌కాలు ముఖం మీద వాలి ర‌క్తాన్ని పీల్చేవి. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించి చిత్రీకరణ చేశాం'' అని చెప్పారు. 


Also Read : ఆంధ్రలో ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు - 'యాత్ర 2' దర్శకుడి సంచలన వ్యాఖ్యలు


నా భయాన్ని బయటపెట్టలేదు!
పతాక సన్నివేశాల కోసం కొండ‌ల మ‌ధ్య‌లో ఉన్న ఒక లోయ‌ను ఎన్నుకున్నామని, ప్ర‌తి రోజూ తెల్లవారుజామున మూడున్నర గంటలకు బ‌య‌ల్దేరి మూడు గంట‌ల‌ పాటు ఆ కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణం చేసి లోయ‌ను చేరుకునేవాళ్ళమని దీన్ రాజ్ తెలిపారు. అయితే... తనకు హైట్స్ ఫోబియా ఉందని, తనతో పాటు పాటు కారులో తోటి ప్రయాణికులు లోయ‌లో ప‌డిపోయిన వాహనాల గురించి మాట్లాడుకుంటుంటే భయం వేసినా సరే, నాయ‌కుడు త‌న పిరికిత‌నాన్ని బ‌య‌ట‌కు చూపించ‌కూడ‌దని పైకి ధైర్యంగా ఉండేవాడినని ఆయన వివరించారు. ఇంకా మాట్లాడుతూ ''మేం ఎన్ని క‌ష్టాలు ప‌డితే ఏంటి? తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుద‌ల కాబోతున్న మా సినిమాను చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారని నమ్ముతున్నా. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా చూసి అభినందించడం తమకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. మాజీ సైనికులు సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ మూమెంట్స్ ఎప్పటికీ మరువలేను'' అని చెప్పారు. 


Also Read మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో ఫస్ట్ పాట







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial