Gun Shots Fired Outside Salman Khan House: తాజాగా ముంబాయ్‌లోని సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా.. ఆ ఇద్దరు వ్యక్తులు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందినవారని, అంతే కాకుండా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్‌కు చెందినవారని పోలీసులు చెప్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు విశాల్ కాగా.. తనకు బిష్నాయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గొడారాతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. రోహిత్ గొడారా.. లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్‌లోని ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడు. తనపై ఇప్పటికీ ఎన్నో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి.


మోస్ట్ వాంటెడ్..


గురుగ్రామ్‌లోని వ్యాపారవేత్త సచిన్ ముంజల్ హత్య కేసులో విశాల్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. రోహిత్ గొడారా కూడా ఆ హత్యలో భాగమే అని తానే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపాడు. ఇక సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో వీరిద్దరి ఫుటేజ్ రికార్డ్ అయ్యింది. అందులో వీరిద్దరూ క్యాప్స్ పెట్టుకొని, బ్యాగ్స్ వేసుకొని కనిపించారు. అంతే కాకుండా సల్మాన్ ఇంటి వైపు గన్‌తో కాల్పులు జరిపిన దృశ్యాలు కూడా ఇందులో రికార్డ్ అయ్యాయి. అందులో ఒకరు వైట్ టీ షర్ట్‌పై బ్లాక్ జాకెట్ వేసుకోగా.. మరికొరు రెడ్ టీ షర్ట్, జీన్స్‌లో కనిపించాడు. సీసీ టీవీ కెమెరాల్లో వారి మొహాలు స్పష్టంగా కనిపించడంతో వీరు ఎవరో త్వరగానే కనిపెట్టారు పోలీసులు.


దొంగిలించిన బైక్‌తో..


సల్మాన్ ఖాన్ గ్యాలక్సీ అపార్ట్మెంట్స్‌ ముందు కాల్పులు జరపడానికి చాలారోజుల ముందు నుండే ఈ ఇద్దరు వ్యక్తులు.. ఆ ఇంటిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఇక కాల్పులు జరిపిన తర్వాత వారు వచ్చిన బైక్‌ను అక్కడే వదిలేసి, రిక్షాలో బాండ్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ నుండి ట్రైన్‌లో ముంబాయ్ వదిలి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో వీరిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. వారు వచ్చిన బైక్ కూడా వారిది కాదని, బాండ్రాలోని మౌంట్ మేరీ చర్చి వద్ద దొంగిలించి తీసుకొచ్చారని తెలుస్తోంది. కాల్పుల తర్వాత సల్మాన్ ఇంటి నుండి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.


మెయిన్ టార్గెట్..


ఈ ఘటన తర్వాత లారెన్స్ బిష్నాయ్ తమ్ముడు అయిన అన్మోల్ బిష్నాయ్.. ఇది కేవలం ప్రివ్యూ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో సల్మాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సైతం సల్మాన్‌కు స్వయంగా ఫోన్ చేసి తన రక్షణ కోసం ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. గతేడాదిలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నాయ్ మెయిన్ టార్గెట్స్‌లో సల్మాన్ ఖాన్ కూడా ఒకడని పోలీసులు గుర్తించారు. అప్పటినుండి తన సెక్యూరిటీ కూడా పెరిగింది. తాజాగా జరిగిన కాల్పుల ఘటన ఈ హీరోను మరింత అలర్ట్ అయ్యేలా చేసింది.



Also Read: కిడ్నాప్ కేసులో నిందితుడిగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్?