శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'పెదకాపు 1' సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. విరాట్ కర్ణ వెండితెరకు హీరోగా పరిచయమైన ఈ మూవీ ఎటువంటి ఓటీటీ అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. ఇంతకీ పెద్దకాపు ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. 'నారప్ప' వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'పెదకాపు 1'. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రావు రమేష్, రాజీవ్ కనకాల, బ్రిగిడ సాగ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.


మరో విశేషం ఏంటంటే ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తనలోని నటుడిని బయటపెట్టారు. ఇందులో శ్రీకాంత్ అడ్డాల విలన్ రోల్ పోషించారు. ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో సెప్టెంబర్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ ఫ్లాట్ బాగున్నా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. కథనం మరీ సాగదీతగా ఉండడంతో ఈ చిత్రాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమాకు మొదటి ఆట నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు.


అసలు సినిమాలో ఎమోషన్ లేదని, చాలా స్లో నేరేషన్ ఉందని కామెంట్లు పెట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పరాజయాన్ని అందుకుంది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకుండా నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో చడి చప్పుడు చేయకుండా సినిమా విడుదలైన నెల రోజుల్లో పై ఓటీటీ లోకి వచ్చేసింది. సినిమాకి భారీగా నష్టాలు రావడంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ విషయంలో అంతగా శ్రద్ధ చూపలేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. 'పెదకాపు 1' అక్టోబర్ 27 శుక్రవారం నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


థియేటర్స్ లో జనాల్ని మెప్పించలేకపోయిన మూవీ ఓటీటీలో అయినా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. మొదటి భాగమే ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు సీక్వెల్ సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' సీక్వెల్ తెరకెక్కిస్తారా? లేక ఆపేస్తారా? అనేది చూడాలి. కెరియర్ ఆరంభంలో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాస్ మూవీస్ తో దర్శకుడిగా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత 'నారప్ప' లాంటి ఊరమాస్ మూవీని తీసి దర్శకుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఆ తర్వాత తెరకెక్కించిన 'పెదకాపు 1' మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో చాలామంది విశ్లేషకులు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ పై విమర్శలు చేశారు.


Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా? మహేష్...



Join Us on Telegram: https://t.me/abpdesamofficial