Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే ఏంటో తెలిపారు. అంతే కాకుండా అసలు తన దృష్టిలో ఓటమి అంటే ఏంటని కూడా చెప్పుకొచ్చారు.
అనుభవం వచ్చింది..
అయిదేళ్ల క్రితం రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు మధ్య కనిపిస్తున్న తేడా గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పటి ఎన్నికల వల్ల తనకు అనుభవం వచ్చిందన్నారు. ‘‘ఓటమి రాకముందు వరకు ఒకలాగా ఉంటుంది. ఓటమి వచ్చిన తర్వాత నేను ఎలా తీసుకుంటున్నాను అని నాతో పాటు అందరికీ తెలుస్తుంది. నేను ధైర్యంగా ఉన్నట్టు బయటికి చూపించవచ్చు. కానీ నా లోపల ఏముంది? ఈ ఓటమిని నేను ఎలా తట్టుకుంటున్నాను? బయట తిరగలానిపిస్తుందా? అవమానంగా ఉందా?’’ అంటూ తనలో తాను ఓటమి తర్వాత ఎలా ఫీల్ అయ్యారో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా తన ఓటమిపై అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యారో కూడా బయటపెట్టారు.
ఓడిపోయానని చెప్తున్నారు..
‘‘రీసెంట్‌గా నా భార్య ఊరు వెళ్లే ముందు ఒక ఫోటో చూపించింది. అందులో ఏముందంటే.. నా రెండో కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకొని పాలు తాగిస్తున్నాను, నా చేతిలో టీ గ్లాస్ ఉంది. అది చూసి ఎప్పుడు తీశావు ఈ ఫోటో అని అడిగాను. 2019లో ఓడిపోయిన రోజున తీశాను అని చెప్పింది. ఆ రోజు టీవీలో రిజల్ట్స్ వస్తున్నాయి. అందులో నేను రెండు చోట్ల ఓడిపోయాను అని చెప్తున్నారు. నేను దాన్ని చూస్తున్నాను. నా ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అని నాకు తెలియకుండా తను ఫోటో తీసింది. నా కొడుకు అప్పటికీ చిన్నోడు. వాడిని ఒడిలో పడుకోబెట్టుకున్నాను’’ అంటూ 2019 రిజల్ట్స్ రోజును గుర్తుచేసుకున్నారు పవన్ కళ్యాణ్. పైగా తనకు ఓటమి అంటే భయం లేదని, ఇప్పటికే చాలాసార్లు జీవితంలో ఓటమిని చూశానన్నారు.
అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు..
‘‘నేను ఓడిపోగానే పట్టు సాధించడానికి ఇలాంటి ప్రారంభం అవసరం అనుకున్నాను. మనిషి నిజస్వరూపం బయటికి రావాలంటే అయితే అధికారం ఇచ్చి చూడాలి లేదా కష్టాలు, ఓటమి ఇచ్చి చూడాలి. ఓటమి చూడగానే తప్పుకునేవాళ్లు ఎదగలేరు. ఉదాహరణకు నేను స్కూల్‌లో సరిగా చదువుకోలేదు. ఇంటర్ అవ్వగానే నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను. కానీ మా అన్నయ్యలు వచ్చి కౌన్సిలింగ్ ఇస్తే బయటపడ్డాను. వయసు పెరిగిన తర్వాత మనకు మనమే కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఓటమి గురించి పక్కన పెడితే అందులో 6 నుండి 7 శాతం ఓటింగ్ సాధించాను. అంతమంది నాయకులతో ప్రచారం చేయగలిగాను. అది సామాన్యమైన విషయం కాదు. నేను బయటికి వచ్చి పార్టీ పెట్టి, నలిగి ఓడిపోవడం కూడా తక్కువేమీ కాదు’’ అని గర్వంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్.
Also Read: ఆధ్య, అకీరాకు నేను ఇచ్చింది అదే - వాళ్లు ఏం నిలబెట్టుకుంటారో చూడాలి: పవన్ కల్యాణ్