'దేవర' సినిమా (Devara Movie) విడుదల సాక్షిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య స్నేహంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని మరోసారి ప్రేక్షకులు అందరికీ తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా విడుదల సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
'దేవర'కు అదనపు ఆటలు టికెట్ రేట్లు!
వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా టికెట్ రేట్లు తగ్గించడంతో అగ్ర హీరోల సినిమాలు, భారీ నిర్మాణ వ్యయంతో తీసిన సినిమాలు పెట్టుబడి రాని పరిస్థితులు చూశాయి. కొన్ని సినిమాలు అయితే నష్టాలు కూడా ఎదుర్కొన్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు అదనపు ఆటలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. 'దేవర' సినిమాకు కూడా అదే విధంగా చేసింది.
'దేవర' చిత్రానికి టికెట్ రేట్లు పెంపుతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదే విధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్... ముగ్గురికి కృతజ్ఞతలు చెబుతూ కథానాయకుడు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమాకు మద్దతుగా నిలుస్తున్నందుకు థాంక్స్ చెప్పారు.
'దేవర' విడుదల సందర్భంగా పవన్ బెస్ట్ విషెస్!
సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఎన్టీఆర్ తెలిపిన కృతజ్ఞతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బదులు ఇచ్చారు. ''శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఏపీలో కొలువుదీరిన తమ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనది చేస్తుంది. అదే విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అండగా నిలబడుతుంది'' అని పవన్ చెప్పారు. సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఏపీ ఎన్నికలలో విజయం సాధించడానికి ముందు జరిగిన ప్రచార కార్యక్రమాలలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలుసార్లు ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హీరో సినిమాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. అందరూ హీరోల అభిమానులు తనకు అండగా నిలబడాలని కోరారు. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చిత్ర సీమకు అండగా నిలబడుతుంది.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే