ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాలు పక్కన పెడితే... చంద్రబాబు అరెస్ట్ సినిమా షూటింగ్ మీద కూడా ప్రభావం చూపించిందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...


జనసేన పార్టీ అధినేత, తెలుగు చిత్రసీమలోని ప్రముఖ కథానాయకులలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ తప్పుల్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఆ మధ్య ఏపీలో ఆయన చేసిన వారాహి యాత్రకు విశేష ఆదరణ లభించింది. యాత్ర ముగిసిన తర్వాత సినిమా చిత్రీకరణలపై పవన్ దృష్టి పెట్టారు. అయితే... ఏపీలో చంద్రబాబు అరెస్టుతో ఆయనను చూడటం కోసం పవన్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు కూడా ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి, అసలు నిజం ఏమిటి? పవన్ ఏపీ ఎందుకు వెళ్లారు? ప్రశ్నలు పక్కన పెడితే... ఒక్కటి మాత్రం నిజం - ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్ ఇచ్చారు. 


'ఉస్తాద్ భగత్ సింగ్'కు స్మాల్ బ్రేక్!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) ఒకటి. ఇటీవల హైదరాబాద్ సిటీలో తాజా షెడ్యూల్ మొదలైంది. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడానికి రెడీ అయినట్టు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. 


వర్షాల కారణంగా ఒకట్రెండు రోజులు ఆలస్యంగా మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణకు... తాత్కాలికంగా బ్రేక్ పడింది. బాబు అరెస్ట్ తర్వాత ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే... లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఏపీ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దాంతో రోడ్డు మార్గంలో ఏపీకి వెళ్లారు పవన్. అయితే... చంద్రబాబును చూడటం కోసమే ఆయన ఏపీ వెళ్లారని ప్రచారం జరుతోంది. జనసేన వర్గాలు మాత్రం తమ పార్టీ మీటింగ్ కోసం జనసేనాని వచ్చారని చెబుతున్నారు. 


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో ఉండటంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆయన సన్నివేశాల చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. పవన్‌ అవసరం లేని సీన్లకు దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు.






పవన్ కళ్యాణ్ రాజకీయ పరమైన షెడ్యూల్స్ కారణంగా అప్పుడప్పుడూ సినిమా చిత్రీకరణలకు ఈ విధమైన పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిస్థితిని నిర్మాతలకు పవన్ ముందుగా వివరించారు. అందుకు వారు సిద్ధం అయ్యే సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. అవసరం అయితే ఏపీలో సెట్స్ వేసి మరీ షూటింగ్స్ చేయడానికి తాము సిద్ధమని ఆ మధ్య దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు. 


Also Read రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?  


'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికి వస్తే... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాల ఫేమ్ సాక్షి వైద్య మరో కథానాయిక. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. 


'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది. 


Also Read మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial