‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఇండియన్ మాత్రమే కాదు... గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు సినిమాను ఏ స్థాయిలో నిలబెట్టాలో... ఆ స్థాయిలో నిలబెట్టి ప్రతీ ప్రేక్షకుడిని గర్వపడేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు... రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. ఇలా అందరి చేత ‘ఆర్ఆర్ఆర్’ ప్రశంసలు పొందింది. తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ గురించి తన భావాలను బయటపెట్టడం మరోసారి తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది టీమ్.


జీ20 సమావేశానికి వచ్చి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రస్తావన..
తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డి సిల్వా.. ఇండియాలోని ప్రతిష్టాత్మకమైన జీ20 సమావేశాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమకు ‘ఆర్ఆర్ఆర్’ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఆస్కార్స్ వరకు వెళ్లడం గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ను ఎంతోమంది ప్రేక్షకులు ఎన్నో వందలసార్లు చూసుంటారు. కొందరు ఆ మూవీని చూసి వదిలేస్తే.. కొందరిపై మాత్రం ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అయినా కూడా ప్రేక్షకులు ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతున్నారంటూ ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది అని అభిమానులు గర్వపడుతున్నారు.


ఆర్ఆర్ఆర్ చూశారా అని అడుగుతున్నారు..
‘ఆర్ఆర్ఆర్ అనేది మూడు గంటల సినిమా. అందులో ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయి. అందమైన డ్యాన్స్ ఉంది. ఇందులో ఇండియాపై బ్రిటిష్ చేసిన రూల్ గురించి విమర్శలు ఉన్నాయి. నేను ఇండియాకు చెందిన ఎవరితో మాట్లాడినా.. ముందుగా ఆర్ఆర్ఆర్ చూశారా అనే అడుగుతున్నారు. ఆ సినిమాలోని ప్రతీ అంశం బాగుంటుంది. ఆ మూవీ సక్సెస్‌కు నేను డైరెక్టర్స్‌ను, ఆర్టిస్ట్‌లను అభినందిస్తున్నాను’ అంటూ లులా డి సిల్వా ప్రస్తావించారు. ఒకప్పుడు మూవీ రిలీజ్ అయిన వెంటనే ఆయన ఇలా ప్రశంసలు కురిపించుంటే అది మామూలు విషయంలాగా ఉండేదని, కానీ ఇన్నాళ్ల తర్వాత ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ప్రస్తావించారు కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఈ విషయంపై మరింత గర్వపడే విషయమని అందరూ అనుకుంటున్నారు.






ఇతర దేశాల్లో కూడా క్రేజ్..
ఇండియాలో మాత్రమే కాదు జపాన్‌లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ 500 రోజుల బెంచ్‌మార్క్‌ను టచ్ చేసింది. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా పలు దేశాల్లో ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలో రన్ అవ్వడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ.. హిందీలో అందుబాటులో ఉండడంతో చాలామంది ఇతర దేశాల ప్రేక్షకులు.. ముందుగా దీనిని హిందీలోనే చూశారు. అందుకే రాజమౌళి తెరకెక్కించనున్న తరువాతి సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి.. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial