Pakistani Celebrities Instagram Accounts Banned In India: పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్ నటులు, వారు నటించిన సినిమాలపై నిషేధం విధించగా.. ఇప్పుడు తాజాగా వారి సోషల్ మీడియా ఖాతాలను సైతం ఇండియాలో బ్యాన్ చేశారు. భారత్ తీవ్ర ఆంక్షలు విధించడంతో ఇప్పటికే పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటే పాక్ సెలబ్రిటీలు సైతం ఉగ్ర దాడి ఫలితాన్ని అనుభవిస్తున్నారు.
వారి ఇన్ స్టా అకౌంట్స్ బ్లాక్
తాజాగా.. పాకిస్థానీ సెలబ్రిటీల ఇన్ స్టా అకౌంట్లను భారత్‌లో బ్యాన్ చేశారు. మహిరాఖాన్ (Mahira Khan), హనియా అమీర్ (Hania Amir), సనమ్ సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్ర అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ వంటి సెలబ్రిటీలకు సంబంధించి ఇన్ స్టా ఖాతాలను బ్లాక్ చేశారు. వీరి పేజ్ యాక్సెస్ చేయాలని యత్నిస్తే.. 'ఇండియాలో ఈ ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్ పరిమితం చేయాలనే చట్టపరమైన ఆదేశాలతో ఇలా చేశాం.' అని మెసేజ్ వస్తోంది. 'మేరే హమ్ సఫర్', 'కభీ మై కభీ తుమ్' సినిమాలతో ఇండియన్ ఆడియన్స్‌కు హనియా అమీర్ పరిచయం అయ్యారు. 2017లో షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. పహల్గామ్ ఉగ్ర దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.
Also Read: బాలకృష్ణ కొత్త బీఎండబ్ల్యూ కార్ చూశారా? - రూ.7.75 లక్షల ఫ్యాన్సీ నెంబర్‌తో..
పాక్ యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్
పాక్ నటులు, వారి సినిమాలు, పాక్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను సైతం తాజాగా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానల్స్, కొందరు జర్నలిస్టుల సోషల్ మీడియా అకౌంట్స్ సైతం బ్యాన్ చేసింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్‌లో కూడా ఎలాంటి ప్రసారాలు లేవు. ఆయా యూట్యూబ్ ఛానళ్లు తెరిస్తే.. 'ఇందులో కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.' అనే మెసేజ్ డిస్ ప్లే అవుతుంది.
భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోస్, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే స్టోరీలను ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలపై ఆయా యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
ఇప్పటికే పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్'ను (Abir Gulaal Movie) భారత్ బ్యాన్ చేసింది. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే వ్యతిరేకత మొదలైంది. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ ఈ సినిమాలో నటించారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'అబీర్ గులాల్'. ఈ క్రమంలో హీరోయిన్‌పైనా విమర్శలు వచ్చాయి. మే 9న థియేటర్లలోకి విడుదల చేసేందుకు సిద్ధం కాగా బ్యాన్ విధించారు.